బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2024 (14:29 IST)

పాక్ గడ్డపైనే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తాం : పీసీబీ

pakistan flag
చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీని పాకిస్థాన్ వేదికపైనే నిర్వహిస్తామని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు స్పష్టం చేసింది. ఈ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడం లేదనీ, అందువల్ల ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ విధానంలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు స్పందించింది. 
 
"భారత్‌, పాకిస్థాన్‌ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. క్రీడలకు వాటికి సంబంధం లేదని నిరూపించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా టోర్నీని విజయవంతం చేస్తామని బలంగా చెబుతున్నాం. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇక్కడే జరుగుతుందని బలంగా భావిస్తున్నాం. 
 
మేం స్పష్టమైన వైఖరితో ఉన్నాం. వేదిక మార్పులంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. పాకిస్థాన్‌ నుంచి ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ వేదిక మారిపోతుందన్న వార్తలను ఖండిస్తున్నాం. టోర్నీని అద్భుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆతిథ్యం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని భావిస్తున్నాం" అని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
ఇదిలావుంటే, షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 టోర్నీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనుందని తెలిసినప్పటి నుంచి టీమ్‌ఇండియా మాత్రం ఒకే మాటపై ఉంటూ వస్తోంది. ఇరుదేశాల మధ్య చివరిసారిగా 2008లో ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ అక్కడికి వెళ్లడం లేదు. తటస్థ వేదికల పైనే ఇరుజట్లూ తలపడుతున్న సంగతి తెలిసిందే. 
 
గత ఆసియా కప్‌ సమయంలోనూ పాక్‌ తమ దేశానికి భారత్ రావాల్సిందేనని పట్టుబట్టింది. భద్రతాపరమైన కారణాల నేపథ్యంలో తమ జట్టు పాక్‌కు వెళ్లదని బీసీసీఐ చెప్పడంతో హైబ్రిడ్‌ మోడల్‌లో ఆసియా కప్‌ జరిగింది. ఇప్పుడు కూడా భారత్‌ మ్యాచ్‌లను దుబాయ్‌ లేదా శ్రీలంకకు మార్చేస్తారని సమాచారం. పాక్‌ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా.. భారత్‌ ఆడకపోతే ఆదాయంపరంగానూ ఇబ్బంది తప్పదని దాయాది దేశానికి భయమూ ఉంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు.