చతికిలపడిన రాజస్థాన్ - ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన తొలి సెమీస్ పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయభేరీ మోగించింది. దీంతో ఐపీఎల్‌లోకి అరంగేట్రంలోనే ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా అవతరించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ అడాడు. 56 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 89 పరుగులు చేశాడు. అలాగే, కెప్టెన్ సంజు శాంసన్ 47, పడిక్కల్ 28 చొప్పున పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
ఆ తర్వాత 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు మరో మూడు బంతులు మిగిలివుండగానే, మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అండగా డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు.
బ్యాటింగ్ ప్రారంభించిన వృద్ధిమాన్ సాహా (0) ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మ్యాథ్యూవేడ్ గిల్‌లు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం మొదలుపెట్టారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో 21 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 35 పరుగులు చేసిన గిల్ రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే 35 పరుగులు చేసిన వేడ్ కూడా ఔట్ కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విధ్వంసకర ఆటతీరుతో రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
మరోవైపు, అతనికి పాండ్యా అండగా నిలబడటంతో విజయం నల్లేరుమీద నడకే అయింది. చివరి ఓవరులో గుజరాత్‌కు 16 పరుగులు కావాల్సివుండగా ఉత్కంఠ నెలకొంది. ఈ ఓవర్‌ను ప్రసిద్ధ్ కృష్ణ వేయగా, మిల్లర్ ఒత్తిని పక్కనబెట్టేసి ప్రశాంతంగా ఆడాడు. తొలి బంతిని లాంగాన్ మీదుగా సిక్స్ బాదాడు.
రెండో బంతిని మిడ్ వికెట్ మీదుగా స్టాండ్స్‌లోకి తరలించాడు. మూడో బంతిని కూడా మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి పంపాడు. మొత్తంగా 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 68 పరుగులు చేశాడు. ఫలితంగా మరో మూడు బంతులు మిగిలివుండగానే గుజరాత్ టైటాన్స్ జట్టు విజయభేరీ మోగించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించిన మిల్లర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా, నేటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడనున్నాయి.