సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 జులై 2019 (18:41 IST)

మొన్న అంబటి రాయుడు.. ఇపుడు దినేష్ కార్తీక్ : సెలెక్టర్ల వైఖరికి కెరీర్ మటాష్ (video)

బీసీసీఐ సెలెక్టర్ల వైఖరికి విసిగివేసారిపోయిన హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడు తన క్రికెట్ కెరీర్‌కు అర్థాంతరంగా స్వస్తి పలికాడు. అంతకుముందు.. ఆ తర్వాత సెలెక్టర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇపుడు దినేష్ కార్తీక్ (డీకే) కెరీర్ కూడా అర్థాంతరంగా ముగియనుంది. ఇపుడు సెలెక్టర్లు డీకే కాదని శ్రేయాస్ అయ్యర్‌పై కన్నేశారు. 
 
ఇటీవల వరల్డ్ కప్ టోర్నీలో దినేష్ కార్తీక్ పెద్దగా రాణించలేకపోయాడు. డీకేతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్‌ల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. వీరిలో ధోనీ రిటైర్మెంటు ప్రకటిస్తాడో లేదో తెలియని అనిశ్చితి. కేదార్ జాదవ్ విండీస్ టూర్‌కు ఎంపిక కావడం కష్టమే. ఇక మిగిలింది దినేశ్ కార్తీక్. 
 
ప్రపంచ కప్ టోర్నీలో దినేష్ కార్తీక్ రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లో 8, మరో మ్యాచ్‌లో ఆరు చొప్పున పరుగులు చేశాడు. ఇప్పటికే అనేక అవకాశాలిచ్చి వరల్డ్ కప్‌లో చోటు కల్పించినప్పటికీ.. అక్కడ కూడా విఫలమై ఊసురుమనిపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు డీకేపై కరుణ చూపుతాడనే ఆశలు లేవు. 
 
ఈ పరిస్థితుల్లో విండీస్ టూర్‌కు వెళ్లే భారత జట్టులోకి యువ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే విండీస్-ఏ జట్టుతో కరేబియన్ గడ్డపై సిరీస్ ఆడతున్న భారత్-ఏ జట్టులో అయ్యర్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ రెండు అర్థసెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయ్యర్ అయితే నం.4 స్థానంలో అతికినట్టు సరిపోతాడన్నది సెలక్షన్ కమిటీ అభిప్రాయంగా తెలుస్తోంది. మొత్తంమీద సెలెక్టర్ వైఖరి కారణంగా మరో క్రికెటర్ కెరీర్ అర్థాంతరంగా ముగియనుంది.