శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (17:22 IST)

డుమ్మా కొడితే వేటు తప్పదు... ఆ మంత్రుల జాబితా సిద్ధం చేయండి : మోడీ

పార్లమెంట్ సమావేశాలకు డుమ్మా కొడుతున్న మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర హెచ్చరిక చేశారు. పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరయ్యే కేంద్ర మంత్రుల జాబితాను సిద్ధం చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు కేంద్ర మంత్రుల హాజరుపలుచగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు డుమ్మా కొడుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి మంత్రుల జాబితాను సిద్ధం చేయాలని ఆయన కోరారు. 
 
పైగా, మంత్రులకు ఇంకా ఆయా శాఖలపై ఇంకా పట్టురాలేదనీ ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌కు రాని మంత్రుల జాబితా సిద్ధం చేయాలని మోడీ ఆదేశించారు. ఇలాంటి మంత్రుల జాబితాను మంగళవారం సాయంత్రానికంతా తనకు ఇవ్వాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని, పార్లమెంట్ వ్యవహారాల శాఖల మంత్రిని ఆదేశించారు. 
 
పార్లమెంట్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలకు కేబినెట్ మంత్రులు కాకుండా.. సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడం.. మరికొంతమంది తమ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడుగానీ, సభ్యులు ప్రశ్నిస్తున్నప్పుడుగానీ సభలో లేకపోవడంపై మోడీ మండిపడ్డారు. రాజకీయాలకు ఆతీతంగా ఎంపీలు పని చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని సూచించారు. దేశంలో అనేక చోట్ల ఏర్పడిన నీటి ఎద్దడి గురించి ప్రస్తావించిన ఆయన.. జల్ అభియాన్ పథకాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.