గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఆతిథ్య నుంచి వైదొలిగిన డొమినికా

tt20wc2024
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మెగా ఈవెంట్‌కు భారత ఆతిథ్యమిచ్చి, ఈ టోర్నీని విజయవంతంగా ముగిసింది. ఇపుడు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ జరగాల్సివుంది. ఈ టోర్నీకి డొమినికా ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే, టోర్నమెంట్ ప్రారంభానికి ముందు నిర్వహించే ప్రాక్టీస్ మ్యాచ్‌లు, ప్రధాన మ్యాచ్‌లను నిర్వహించాల్సిన స్టేడియాలకు సంబంధించిన పనులు పూర్తికాలేదు. దీంతో ఆతిథ్యం నుంచి ఆ జట్టు వైదొలగింది. 
 
ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న వేదికలలో ఒకటైన విండ్సర్ పార్క్‌లో పనులు జరుగుతున్న వేగాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత డొమినికా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం పనులు జరుగుతున్న వేగాన్ని పరిశీలిస్తే నిర్ణీత సమయంలో వేదికలను సంసిద్ధం చేయలేమని స్పష్టంచేసింది. ప్రాక్టీస్, టోర్నీ మ్యాచ్‌లు నిర్వహించాలని భావించిన విండ్సర్ పార్క్ స్పోర్ట్స్ స్టేడియం, బెంజమిన్స్ పార్క్ వసతులను మెరుగుపరచాల్సి ఉంది. అవసరమైన చోట అదనపు పిచ్‌లను కూడా రూపొందించాల్సి ఉంది. కానీ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని డొమినికా ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. 
 
కాంట్రాక్టర్లు సమర్పించిన పనుల పురోగతిని పరిశీలిస్తే టోర్నమెంట్ ప్రారంభానికి ముందు నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం సాధ్యం కాదని వివరించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వడంలో డొమినికాకు ఉన్న ఖ్యాతి దృష్ట్యా తాజా నిర్ణయం అందరికీ మేలు చేస్తుందని డొమినికా పేర్కొంది. జూన్ 2024లో టీ20 వరల్డ్ కప్ విజయవంతంగా నిర్వహించాలని నిర్వాహకులకు డొమినికా శుభాకాంక్షలు తెలిపిందని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో రిపోర్ట్ పేర్కొంది.
 
ఇదిలావుంచితే.. 2024 టీ20 వరల్డ్ కప్‌ను అమెరికాలోని న్యూయార్క్, డల్లాస్‌, కరేబియన్‌లోని 7 దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. డొమినికాతోపాటు ఆంటిగ్వా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు ఉన్నాయి. తాజాగా డొమినికా వైదొలగడంతో 6 కరేబియన్ దేశాలు మాత్రమే ఆతిథ్యం ఇవ్వనున్నాయి. చివరకు  ఆతిథ్యమిచ్చే దేశాలు ఎన్ని నిలుస్తాయో వేచి చూడాల్సిందే.