గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 మే 2018 (15:05 IST)

ఐపీఎల్ 2018 : సన్‌రైజర్స్ చిత్తు... ఫైనల్లోకి చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2018 పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ 1 మ్యాచ్‌ తుదికంటా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు చేసింది. ఫలితంగా నేరుగా ఫై

ఐపీఎల్ 2018 పోటీల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ 1 మ్యాచ్‌ తుదికంటా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు చేసింది. ఫలితంగా నేరుగా ఫైనల్లోకి అడుగుపెట్టింది.
 
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఓపెనర్లు ధవన్‌ డకౌట్ కాగా, శ్రీవత్స్‌ గోస్వామి 12, విలియమ్సన్‌ 24, మనీష్‌ పాండే 8, షకీబ్‌ 12, యూసుఫ్‌ పఠాన్‌ 24, బ్రాత్‌వైట్‌ (నాటౌట్‌) 43, భువనేశ్వర్‌ (రనౌట్‌) 7 చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగుల రూపంలో 9 రన్స్ వచ్చాయి. 
 
ఆ తర్వాత 140 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి తిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 19.1 ఓవర్లలో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్‌ అసాధారణ బ్యాటింగ్‌ చేశాడు. ఫలితంగా 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 (నాటౌట్) పరుగులు చేయడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-11 ఫైనల్లోకి ప్రవేశించింది. 
 
అతడి ఆటతీరుతో విజయంపై ఆశలు లేని స్థితిలో నుంచి తేరుకున్న చెన్నై రెండు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై నెగ్గింది. ఆఖరులో శార్దుల్‌ ఠాకూర్‌ (5 బంతుల్లో 3 ఫోర్లతో 15 నాటౌట్‌) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. నిజానికి ఈ మ్యాచ్ తొలి ఓవర్‌లోనే వాట్సన్‌ను భువనేశ్వర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే రెండో ఓవర్‌లో రైనా (13 బంతుల్లో 4 ఫోర్లతో 22) వరుసగా మూడు ఫోర్లతో ఆకట్టుకున్నా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 
 
నాలుగో ఓవర్‌లో సిద్ధార్థ్‌ కౌల్‌ కళ్లు చెదిరే రీతిలో రైనా, రాయుడులను వెంటవెంటనే అవుట్‌ చేయడంతో చెన్నై శిబిరంలో ఆందోళన నెలకొంది. ఆ తర్వాత కెప్టెన్‌ ధోనీ (17 బంతుల్లో 1 ఫోర్‌తో 9) సింగిల్‌ తీసేందుకే ఎనిమిది బంతులాడాల్సి వచ్చింది. తీరా రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో బంతిని సరిగ్గా అంచనా వేయక బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో సీఎస్కే 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది.
 
ఈ సమయంలో బ్రావో (7), జడేజా (3) వరుస ఓవర్లలో అవుటైన అనంతరం డుప్లెసిస్‌ జూలు విదిల్చాడు. 14వ ఓవర్‌లో 4,6తో ఆశలు రేకెత్తించాడు. తర్వాతి ఓవర్‌లో దీపక్‌ చాహర్‌ సిక్స్‌ బాదినా సందీప్‌ శర్మ అవుట్‌ చేశాడు. ఇక 16వ ఓవర్‌లో రషీద్‌.. డుప్లెసిస్‌ను ఔట్‌ చేసినా తను రివ్యూకు వెళ్లి బతికిపోయాడు. ఈ ఓవర్‌లో ఒక్క పరుగే వచ్చింది. 
 
చెన్నై ఆటంతా చివరి మూడు ఓవర్లలోనే వచ్చింది. అప్పటిదాకా నత్తనడకన సాగిన వీరి ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో డుప్లెసిస్‌ 4,6,4,4తో చెలరేగడంతో నిశ్శబ్దంగా ఉన్న స్టేడియం హోరెత్తింది. దీంతో పాటు అతడు 37 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక చివరి 12 బంతుల్లో 23 పరుగులు రావాల్సి ఉండగా 19వ ఓవర్‌లో శార్దుల్‌ ఠాకూర్‌ మూడు ఫోర్లు బాది ఒత్తిడి తగ్గించాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో లక్ష్యం ఆరు బంతుల్లో 6 పరుగులకు పడిపోయింది. కానీ తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన డుప్లెసిస్‌ చెన్నై శిబిరంలో ఆనందాన్ని నింపుతూ ప్రత్యర్థిపై మూడో విజయాన్ని అందించాడు.