గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జులై 2021 (16:02 IST)

హర్భజన్‌ సింగ్‌ ఇంటికి వారసుడు.. మా చేతుల్లోకి మరో చిట్టి చెయ్యి..!

Harbhajan Singh_Geeta Basra
మాజీ క్రికెటర్‌ పుత్రోత్సాహం కలిగింది. హర్భజన్‌ సింగ్‌ ఇంటికి వారసుడొచ్చాడు. శనివారం తమకు అబ్బాయి పుట్టాడంటూ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్విట్టర్‌లో భజ్జీ పోస్ట్‌ చేశాడు. కాగా, హర్భజన్‌, గీతా బస్రా దంపతులకు ఇప్పటికే హినాయ అనే పాప ఉంది.
 
2016 జులైలో వారికి తొలిసంతానం కలిగింది. ఆరోగ్యవంతమైన మగ బిడ్డను ప్రసాదించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నామని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని భజ్జీ తెలిపాడు. చాలా చాలా ఆనందంగా ఉందన్నాడు. తమ మంచిని కోరుతూ ఎప్పుడూ అండగా నిలిచి ప్రేమను పంచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు. 
 
''మా చేతుల్లోకి మరో చిట్టి చెయ్యి వచ్చింది. అతడి ప్రేమ గొప్పది. మా బంగారం. మాకు దక్కిన గొప్ప కానుక. అత్యంత ప్రత్యేకమైనదది. ఆ ఆనందంతో మా హృదయాలు ఉప్పొంగుతున్నాయి'' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
 
2016 నుంచి భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న హర్భజన్ సింగ్.. ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే. హర్భజన్ సింగ్‌, గీతా బస్రాలకి ఇప్పటికే నాలుగేళ్ల పాప హనియా ఉంది.
 
వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్‌కి దూరంగా ఉన్న హర్భజన్ సింగ్.. ఐపీఎల్ 2021 సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ.. ఈ మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. 
 
దాంతో.. తర్వాత నాలుగు మ్యాచ్‌లూ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకాబోతున్నాయి. ఇక గీతా బస్రా... ''దిల్‌ దియా హై'' సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు.
 
బ్రిటన్‌లో జన్మించిన గీతా బస్రాని అక్టోబరు 29, 2015లో హర్భజన్ సింగ్ వివాహం చేసుకున్నాడు. బాలీవుడ్ సినిమాల్లో నటించిన గీతా బస్రా ఓ కామన్ ఫ్రెండ్‌ ద్వారా హర్భజన్ సింగ్‌కి పరిచయమవగా.. ఆ తర్వాత ఇద్దరూ కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్నారు.
 
పెళ్లి తర్వాత సినిమాలకి గుడ్‌ బై చెప్పేసిన గీతా బస్రా హౌస్ వైఫ్‌గా ఉండిపోయింది. మరోవైపు టీమిండియాకి దూరమైన తర్వాత హర్భజన్ సింగ్ క్రమంగా దేశవాళీ క్రికెట్‌లోనూ మ్యాచ్‌లు ఆడటం మానేశాడు. ప్రస్తుతం ఈ వెటరన్ స్పిన్నర్ ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు.