శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2019 (13:16 IST)

తనంత బలవంతుడు లేడన్నట్టుగా ఫీలవుతాడు.. షమీపై భార్య కామెంట్స్

భారత పేసర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హసిన్ జహాన్ మరోమారు విమర్శలు గుప్పించింది. తనంత బలవంతుడు లేడన్నట్టుగా షమీ ఫీలవుతాడని చెప్పుకొచ్చింది. షమీపై మార్చిలో వరకట్నం, లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. భార్య జహాన్ పెట్టిన గృహహింస కేసు షమీని వెంటాడుతోంది. దీంతో ఆయనకు అరెస్టు వారెంట్ జారీ అయింది. ఫలితంగా షమీ మరోమారు చిక్కుల్లో పడ్డారు. 
 
తాజాగా ఈ కేసులో షమీకి కోల్‌కతాలోని అలీపుర్‌ కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అతడు ప్రస్తుతం వెస్టిండీస్‌లో ఉండడంతో స్వదేశానికి వచ్చాక 15 రోజుల్లోగా న్యాయస్థానం ముందు హాజరు కావాలని అదనపు చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ సుబ్రతా ముఖర్జీ ఆదేశించారు. ఒకవేళ వ్యక్తిగతంగా రాకపోతే షమీని అరెస్టు చేసే అవకాశముంటుంది. 
 
ఈ కేసులో నిందితుడిగా ఉన్న షమీ సోదరుడు హసీబ్‌ అహ్మద్‌కు సైతం కోర్టు వారెంట్‌ జారీ చేసింది. షమీ న్యాయవాదితో వారెంట్‌ విషయంపై మాట్లాడి.. తదుపరి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ కూడా ప్రకటించింది. తనను వేధిస్తున్నారంటూ షమీతో సహా అతడి కుటుంబ సభ్యులపై హసిన్‌ జహాన్‌ గతేడాది గృహహింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే.
 
ఈ అరెస్టు వారెంట్‌పై షమీ భార్య స్పందిస్తూ, 'న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు. ఏడాది కాలంగా న్యాయం కోసం వేచిచూస్తున్నా. ఎట్టకేలకు మంచి నిర్ణయం వెలువడింది. తనంత బలవంతుడు లేడన్నట్టుగా షమీ మితిమీరి ప్రవర్తిస్తాడు. తానో పేద్ద క్రికెటర్‌లా ఫీలవుతాడు. నేను బెంగాల్‌కు చెందినదాన్ని కాకున్నా.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాకుండా వేరే ఎవరున్నా నేను క్షేమంగా ఉండేదాన్ని కాదు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నప్పుడు అమ్రోహ పోలీసులు నన్నూ, నా కూతుర్ని వేధింపులకు గురిచేశారు. దేవుని దయవల్ల అక్కడ నుంచి క్షేమంగా బయటపడ్డాం' అని వాపోయింది.