మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 1 ఆగస్టు 2019 (20:35 IST)

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అరెస్ట్‌కు రంగం సిద్ధం?

ఓ ప్రముఖ టీవీ చానల్ తమకు రూ. 3.50 కోట్లను ఇవ్వడంలో బెల్లంకొండ సురేష్ విఫలం అయ్యారని ఆరోపించగా, కోర్టు అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, దాదాపు ఆరేళ్ల క్రితం హిందీలో యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ 'బాండ్ బాజా బరాత్' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇది హిందీలో సూపర్ హిట్ అయింది. 
 
అదే సమయంలో బెల్లంకొండ సురేష్, సమంత, సిద్ధార్థ్ హీరో హీరోయిన్లుగా 'జబర్దస్త్' అనే సినిమాను నిర్మించారు. తమ సినిమాలోని 19 సీన్లను 'జబర్దస్త్'లో కాపీ చేశారని ఆరోపిస్తూ, అప్పట్లోనే యశ్ రాజ్ ఫిలిమ్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన కోర్టు సినిమా ప్రదర్శనను నిలిపివేసింది. కాగా, ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే శాటిలైట్ హక్కులను రూ. 3.50 కోట్లకు బెల్లంకొండ అమ్మేసుకున్నారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ హైకోర్టు, చిత్రాన్ని టీవీల్లో సైతం ప్రదర్శించరాదని ఆదేశించింది.
 
ఆపై సదరు టీవీ చానల్ తాము చెల్లించిన రూ.3.50 కోట్లను తిరిగి చెల్లించాలని బెల్లంకొండ సురేష్ చుట్టూ ఆరేళ్లుగా తిరుగుతున్నా, ఇవాళ, రేపు అంటూ ఆయన తిప్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో సదరు చానెల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించగా, అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అప్పట్లో చానెల్ ఇచ్చిన రూ.3.50 కోట్ల మొత్తం ఇప్పుడు వడ్డీలతో కలిపి రూ. 11.75 కోట్లకు చేరడం గమనార్హం. మరి బెల్లంకొండ ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారో?