శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 జులై 2024 (12:41 IST)

బీసీసీఐ ఇచ్చిన రూ.125 కోట్ల నజరానాను క్రికెటర్లకు ఎలా పంచుతారంటే?

bcci
ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) భారీ నజరానా ఇచ్చింది. ఏకంగా రూ.125 కోట్ల మేరకు బహుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని జట్టు సభ్యులతో పాటు అదనపు ఆటగాళ్లు, జట్టు ప్రధాన కోచ్, సహాయ కోచ్‌లు, వైద్యులు, సహాయక సిబ్బంది ఇలా జట్టులో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి పంచారు. అయితే, మొత్తాన్ని సభ్యులందరికీ సమానంగాకాకుండా, వారివారి హోదాలు, ప్రతిభకు తగిన విధంగా పంచారు. 
 
ఈ వరల్డ్ కప్ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టు తరపున మొత్తం 42 మంది సభ్యులు ఆతిథ్యమిచ్చిన అమెరికా, వెస్టిండీస్‌ దేశాలకు చేరుకుంది. అందులో 15 మంది ఆటగాళ్లతోపాటు రిజర్వ్ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఉన్నారు. దీంతో బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నజరానాను మొత్తం 42 మందికి పంచనున్నారు. అయితే అందరికీ సమానంగా కాకుండా బృందంలో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారన్న దాని ఆధారంగా ఎవరికి ఎంత చెల్లించాలో బీసీసీఐ లెక్కగట్టింది.
 
ఆ ప్రకారం జట్టులోని 11 మంది ఆటగాళ్లతోపాటు జట్టులోని మొత్తం 15 మంది సభ్యులు రూ.5 కోట్ల చొప్పున అందజేయనుంది. అంటే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్ళతో పాటు 15 మంది సభ్యుల జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.5 కోట్ల చొప్పున లభించనుంది. అలాగే ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం రూ.5 కోట్లు ఇవ్వనుంది. 
 
ఇకపోతే, ఇతర కోచింగ్ సిబ్బందికి రూ.2.5 కోట్ల చొప్పున అందజేయనుంది. అంటే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే రూ.2.5 కోట్లు చొప్పు ఇవ్వనుంది. ఇక వరల్డ్ కప్‌కు జట్టును ఎంపిక చేసిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులకు రూ.కోటి చొప్పున నజరానాను అందించనుంది. సపోర్ట్ స్టాఫ్‌లో ఉన్న ముగ్గురు ఫిజియోథెరపిస్టులు, ముగ్గురు త్రో డౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్లు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌కు రూ.2 కోట్ల చొప్పున ఇవ్వనుంది.