గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 21 మే 2019 (15:49 IST)

ఆస్ట్రేలియాకు ఓటేసిన కుంబ్లే - గంభీర్ :: భారత్‌ వైపు లారా మొగ్గు

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఐసీసీ వరల్డ్ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో టైటిల్ ఫేవరేట్ జట్లుగా ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. అయితే, అన్నిటికంటే ఆస్ట్రేలియానే విజయభేరీ మోగిస్తుందని పలువురు క్రికెటర్లు చెపుతున్నారు. ముఖ్యంగా, భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, గౌతం గంభీర్ వంటివారు కంగారుల వైపే మొగ్గుచూపుతున్నారు. కానీ, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రం కోహ్లీ సేనకు ఓటు వేశారు.
 
ముందుగా అనిల్ కుంబ్లే ఏం మాట్లాడారో పరిశీలిస్తే, ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచే అర్హత ఆస్ట్రేలియాకు ఉంది. ఇప్పటివరకూ జరిగిన అన్ని ఐసీసీ ఈవెంట్‌లలోనూ ఆస్ట్రేలియాకు అద్భుతంగా రాణించిందని గుర్తుచేశారు. 
 
"వాళ్లు ప్రతీ ప్రపంచకప్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఈసారి వాళ్ల జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్ పరిస్థితులు కూడా వాళ్లకి బాగా తెలుసు. కాబట్టి వాళ్లు విజయవంతంగా టోర్నమెంట్‌ను ముగిస్తారని అనుకుంటున్నారు. 
 
అలాగే గౌతం గంభీర్ మాట్లాడుతూ, ఈ సారి వరల్డ్ కప్ కొట్టేది మాత్రం ఆస్ట్రేలియా అని జోస్యం చెప్పారు. ఆసీస్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందన్నారు. ఇంగ్లండ్‌కు మాత్రం స్వదేశీ పిచ్‌లపై ఆడటమే అనుకూల అంశంగా ఉందన్నారు. ఇంగ్లండ్ జట్టు గతంతో పోలిస్తే బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో బలంగా ఉందన్నారు. ఇంగ్లండ్‌కు అదనపు బలం మాత్రం ఆల్‌రౌండర్లు అని చెప్పుకొచ్చాడు. ఫైనల్‌లో ఆసీస్‌తో టీమిండియా లేదా ఇంగ్లాండ్ ఆడుతుందన్నారు. 
 
వరల్డ్ కప్ గెలువాలంటే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నారు. ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తారని గౌతమ్ తెలిపారు. భారత జట్టుకు బుమ్రా ఎక్స్ ఫ్యాక్టర్‌లా కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చారు. 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో గంభీర్ శ్రీలంకపై 97 పరుగులు చేసి ప్రపంచ కప్ రావడంలో కీలక వ్యక్తిగా మారాడు. కాగా, ఈ వరల్డ్ కప్‌లో టైటిల్ ఫేవరేట్‌ జట్లుగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లను పేర్కొన్నారు. 
 
చివరగా బ్రియాన్ లారా స్పందిస్తూ, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. ప్రస్తుతం టీమిండియా సమతూకంలో ఉందనీ... అన్ని పరిస్థితుల్లోనూ రాణించగల ఆటగాళ్లు జట్టులో ఉన్నందున టైటిల్ గెలుచుకోగలరని జోస్యం చెప్పాడు.
 
'భారత జట్టు విజేతగా అవతరిస్తే ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. విభిన్న పరిస్థితుల్లో సైతం వారు చక్కగా రాణిస్తున్నారు. భారత జట్టు చాలా సమతూకంలో ఉంది. భారత్ బలమైన జట్టు అని చెప్పడంలో సందేహమే లేదు' అని లారా చెప్పుకొచ్చారు.
 
అయితే, సొంతగడ్డపై ఆడుతున్న ఇంగ్లండ్ జట్టు సైతం ఈ సారి గట్టిపోటీ ఇవ్వగలదని లారా అన్నాడు. 1975లో ఈ టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు ఇంగ్లండ్ ప్రపంచ కప్ గెలుచుకోలేదనీ... దీంతో ఆ జట్టు ఈ సారి గట్టిగానే ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని లారా అభిప్రాయం వ్యక్తం చేశాడు.