శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 అక్టోబరు 2024 (22:21 IST)

గ్వాలియర్ టీ20 మ్యాచ్ : బంగ్లాపై భారత్ ఘన విజయం

samson
స్వదేశంలో పర్యాటక బంగ్లాదేశ్‌తో జరుగుతున్న క్రికెట్ సిరీస్‌లో భారత క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటికే టెస్టుల్లో పర్యాటక జట్టును మట్టికరిపించిన భారత కుర్రోళ్లు.... ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో విజయం సాధించింది. మొత్తం మూడు మ్యాచ్‌ల టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరచిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. 
 
తొలుత బంగ్లాదేశ్‌ను 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. 128 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (16; 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. సంజు శాంసన్ (29; 19 బంతుల్లో 6 ఫోర్లు) రాణించాడు. 
 
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29; 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు తనదైనశైలిలో చెలరేగి ఆడాడు. నితీశ్‌కుమార్‌ రెడ్డి (16 నాటౌట్) పరుగులు చేయగా.. మ్యాచ్ ఆఖరులో హార్దిక్‌ పాండ్య (39 నాటౌట్; 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. రెండో టీ20 ఢిల్లీ వేదికగా బుధవారం (అక్టోబర్ 9న) జరుగనుంది.
 
అలాగే, బంగ్లాదేశ్ జట్టులో మెహిదీ హసన్ మిరాజ్ (35 నాటౌట్; 32 బంతుల్లో 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (27; 25 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. తౌహిద్ హృదయ్ (12), తస్కిన్ అహ్మద్ (12), రిషాద్‌ హొస్సేన్ (11) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ బాటపట్టారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (3/31), అర్ష్‌దీప్‌ సింగ్ (3/14) అదరగొట్టారు. మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్‌ పాండ్య తలో వికెట్ పడగొట్టారు.