శనివారం, 9 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (22:08 IST)

సెంచరీ సిక్సర్ షాట్‌తో బంగ్లాకి ఫినిషింగ్ టచ్ ఇచ్చిన ''కింగ్" కోహ్లీ

Virat Kohli
కర్టెసి-ట్విట్టర్
ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లి సెంచరీ సిక్సర్ షాట్‌తో బంగ్లాదేశ్ పైన విజయం ఖాయం చేసాడు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ప్లేయర్లు ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. రోహిత్ శర్మ 40 బంతుల్లో 2X6, 7X4తో 48 పరుగులు చేసి హసన్ బౌలింగులో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి- శుభమన్ గిల్‌తో కలిసి అదే దూకుడు కొనసాగించాడు.

ఐతే శుభమన్ లాంగ్ షాట్ కి ప్రయత్నించి మెహిది బౌలింగులో మహ్మదుల్లాకి దొరికిపోయాడు. గిల్ 55 బంతుల్లో 2x6, 5X4తో 53 పరుగులు చేసాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 19 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. ఆ సమయానికి జట్టు స్కోరు 178 పరుగులు. అనంతరం క్రీజులోకి వచ్చిన కె.ఎల్. రాహుల్ ఒకవైపు ధాటిగా ఆడుతూనే సెంచరీ అవకాశమున్న కోహ్లికి అది సాధించే దిశగా సాగాడు.

అంతేకాదు... కోహ్లి సెంచరీ చేసేందుకు మరో రెండు పరుగులు అవసరమైన దశలో నాసన్ వైడ్ బాల్ విసిరాడు. దానిని ఎంపైర్ వైడ్ ఇవ్వలేదు. బంతి కరెక్టుగానే పడిందన్నట్లు సైగ చేసాడు. మొత్తానికి అలా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న కోహ్లి సిక్సర్ గా మలిచాడు. ఈ సిక్సర్ తో పాటే జట్టు విజయం కూడా షురూ అయిపోయింది. మరో 51 బంతులు మిగిలి వుండగానే భారత్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పైన ఘన విజయం సాధించింది.