కోల్‌కతా టెస్ట్ మ్యాచ్ : సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన భారత్
కోల్‌కతా వేదికగా భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగిన తొలి టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ పర్యాటక సఫారీల చేతిలో చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 124 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లు ఆ లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఫలితంగా 30 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు.
భారత ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్ (31), అక్షర్ పటేల్ (26), రవీంద్ర జడేజా (18), ధ్రువ్ జురెల్ (13) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ మెడ నొప్పి కారణంగా మైదానాన్ని వీడిన శుభ్‌మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు రాలేదు.
సైమన్ హర్మర్ (4/21), మార్కో యాన్సెన్ (2/15), కేశవ్ మహరాజ్ (2/37) భారత జట్టు పతనాన్ని శాసించారు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 159, సెకండ్ ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసింది. టీమ్‌ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 189, రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే ఆలౌట్ కావడంతో ఓటమిని మూటగట్టుకోక తప్పలేదు.
మరోవైపు, భారత గడ్డపై సౌతాఫ్రికా జట్టు ఒక టెస్ట్ మ్యాచ్‌లో గెలుపొందడం 15 యేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే, రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్ హర్మర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.