శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (07:15 IST)

ఉల్లిపాయలు ఎగుమతి చేసుకోవచ్చు... క్రికెట్ ఆడకూడదా.. ఇదెక్కడి న్యాయం...

భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొనివున్న క్రికెట్ సంబంధాలపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తనదైనశైలిలో స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉల్లిపాయలు ఎగుమతి మాత్రం సాఫీగా సాగిపోవచ్చు.. కానీ, క్రికెట్ మ్యాచ్‌లు మాత్రం ఆడకూడదా? అంటూ ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీశారు. కనీసం ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లను తటస్థ వేదికలపై అయినా నిర్వహించాలని ఆయన కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇండో పాక్ దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు నిలిచిపోవడం ఇరు దేశాలకు ఏమాత్రం మంచిదికాదన్నారు. అన్ని ఆటల్లో లేనిది క్రికెట్‌లో ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ఉల్లిపాయలు, ఆలుగడ్డల ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయని.. అలాంటప్పుడు క్రికెట్ మాత్రం ఎందుకు ఆడకూడదని నిలదీశారు. 
 
అయితే ఈ విషయంలో తాను ఏ ఒక్కరినీ తప్పుపట్టడం లేదని చెప్పుకొచ్చారు. ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లు జరగడం క్రికెట్ ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. పాకిస్థాన్ ఆటగాళ్లు భారత్‌కు, భారత్ ఆటగాళ్లు పాకిస్థాన్‌కు వచ్చే పరిస్థితులు లేవు. అలాంటపుడు తటస్థ వేదికలపై ఈ మ్యాచ్‌లన నిర్వహించవచ్చు కదా అని ప్రశ్నించారు. 
 
తాము సచిన్‌ను, గంగూలీని, సెహ్వాగ్‌ను ఎంతగానో ఇష్టపడతామన్నారు. ఇరు దేశాల మధ్య విభేదాలు క్రికెట్‌పై ప్రభావం చూపకూడదన్నది తన అభిప్రాయమని చెప్పారు. త్వరలోనే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు జరుగుతాయని ఆశిస్తున్నట్టు షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చారు.