శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

టీమిండియాకు మరో షాక్ : టెస్ట్ సిరీస్ నుంచి షమీ దూరం

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ టెస్ట్ సిరీస్ నుంచి భారత పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు. గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌ నుంచి వైదొలిగాడు. 
 
ఈ నెల 17వ తేదీ నుంచి జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో శనివారం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాట్ కమిన్స్‌ వేసిన బౌన్సర్ షమీ కుడి చేతికి తగలడంతో అతను గాయపడ్డాడు. దీంతో ఆట మధ్యలోనే రిటైర్డ్‌హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. 
 
తీవ్ర నొప్పితో బాధపడిన షమీని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్‌ నిర్వహించారు. తన చేతికి ఫ్రాక్చర్‌ అయినట్లు డాక్టర్లు తెలపడంతో షమీ సిరీస్‌లోని ఆఖరి మూడు టెస్టులకు దూరంకానున్నాడు. 
 
'షమీ చేతికి ఫ్రాక్చర్‌ అయింది. అందుకే అతడు క్రీజులో బ్యాట్‌ను పట్టుకొని పైకి ఎత్తలేకపోయాడు. గాయం తీవ్రత పెద్దదేనని' షమీ సన్నిహిత వర్గాల సమాచారం. కాగా, తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయిన విషయం తెల్సిందే.