శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (08:57 IST)

ఇంటికి వచ్చేస్తున్నా.. సగర్వంగా ఇంటికి బయలుదేరనున్న పాండ్యా.. ఎందుకు?

భారత క్రికెట్ జట్టు సభ్యుల్లో ఒకడు హార్దిక్ పాండ్యా. ఈ హిట్టర్ ఓ ఆల్‌రౌండర్.. అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ సత్తా చాటుతూ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టులో పాండ్యా కూడా ఒకడు. కానీ, ఈ క్రికెటర్‌ను కేవలం వన్డేలు, ట్వంటీ20 సిరీస్‌లకు మాత్రమే సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇపుడు వన్డే, టీ20 సిరీస్ ముగియడంతో హార్దిక్ పాండ్యా సగర్వంగా స్వదేశానికి బయలుదేరనున్నాడు. 
 
పైగా, ఇటీవలే ఓ బిడ్డకు తండ్రి అయిన పాండ్యా... దాదాపు గత నాలుగు నెలలుగా తన బిడ్డకు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు. అయితే, మంగళవారం జరిగిన మ్యాచ్‌ తర్వాత మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభిస్తుందని ఎంతమాత్రమూ ఊహించలేదన్నాడు. 
 
జట్టు కలిసికట్టుగా రాణించడంతోనే టీ-20 సిరీస్ లో గెలుపు సాధ్యమైనందని అన్నారు. వన్డే సిరీస్‌లో రెండు వరుస మ్యాచ్‌లను ఓడిపోయిన అనంతరం, తమకు మిగిలింది నాలుగు మ్యాచ్‌ల సిరీస్ అనుకున్నామని, అందుకు తగ్గట్టుగానే మూడు మ్యాచ్‌లలో వరుసగా గెలిచామని తెలిపిన పాండ్యా, ఇప్పుడు జట్టు సభ్యులంతా ఆనందంగా ఉన్నారని చెప్పాడు.
 
సిరీస్ మొదలైన తర్వాత తనకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని అనిపించలేదని, ఇప్పుడు మాత్రం సంతోషంగా ఉందన్నాడు. ఇక ఇండియాకు వెళ్లి, తన బిడ్డతోనూ, కుటుంబ సభ్యులతోనూ కొంతకాలం సంతోషంగా గడుపుతానని చెప్పాడు. కాగా, ఆస్ట్రేలియాలో పర్యటన అనంతరం హార్దిక్, టీ-20 వరల్డ్ కప్‌తో పాటు ఐపీఎల్‌కు సిద్ధం కానున్నాడు.
 
నిజానికి దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్, ఆపై ఆస్ట్రేలియాతో వన్డేలు, టీ-20 సిరీస్‌ల అనంతరం హార్దిక్ కు విశ్రాంతిని ఇవ్వాలని భావించిన బీసీసీఐ అతన్ని టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే.