గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (12:47 IST)

కోహ్లీ నిర్ణయాలే కొంపముంచాయా?

టీమిండియా ఫ్యాన్స్ అంచనాలన్నీ తలకిందులు చేస్తూ కోహ్లీసేన ఘోరపరాభవం పాలైంది. భారత్ కనీస పోటీని కూడా ఇవ్వకుండా చేతులెత్తేయడంతో నిన్నటి సాయంత్రం నుంచి ఇప్పటివరకు ఫ్యాన్స్ అనేక కోణాల్లో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కోహ్లీ తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతూ విరుచుకుపడుతున్నారు. 
 
తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఆర్డర్ 10 ఓవర్లలోనే కుప్పకూలింది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ సిక్సులు, ఫోర్లతో చెలరేగుతూ తమపై యావద్భారత్ పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలనుకున్నారు. మంచి భాగస్వామ్యంతో ఇండియా స్కోర్‌ను పరుగులు పెట్టించారు. రిషబ్ పంత్ రెండుసార్లు ఒంటిచేత్తో సిక్సర్లు బాది స్టేడియం మొత్తాన్ని హోరెత్తించారు.
 
కానీ వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత దిగిన ఆటగాళ్లు చాలా పేలవమైన ఆట ప్రదర్శన కనబరిచారు. ఈ సమయంలో 'అంతా మీరే చేశారంటూ..' నెటిజన్లు కోహ్లిని విమర్శించడం ప్రారంభించారు. మంచి జోరు మీద ఉన్న ఇషాన్ కిషన్‌ను ఎందుకు తీసుకోలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 
 
ఇషాన్ కిషన్ ఫామ్‌లో ఉన్నాడని.. అతన్ని పక్కనపెట్టేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ట్విట్టర్‌లో భారీ ఎత్తున విరుచుకుపడ్డారు. హార్ధిక్ పాండ్యా ఫామ్‌లో లేడని.. అసలు అతని ఫిట్‌నెస్‌యే బాగోలేదని కూడా నెటిజన్లు ప్రస్తావించారు.