ధోనీ సేన అదుర్స్.. కింగ్‌గా నిలిచిన చెన్నై.. అగ్రస్థానంలో ఎల్లో ఆర్మీ
కనక వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది ఏకంగా 80 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తుగా ఓడించింది.
ఫలితంగా ఐపీఎల్ పట్టికలో 18 పాయింట్లతో చెన్నై అగ్ర స్థానానికి చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణిత 20 ఓవర్లు ముగిసే సరికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. కేవలం 4 పరుగులకే ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన పృథ్వీషాని దీపక్ చాహర్ పెవిలియన్ చేర్చాడు.
ఇలా ఢిల్లీ ఆటగాళ్లు స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో... చెన్నైకి ప్లస్ అయ్యింది. ఫలితంగా ఢిల్లీ 16.2 ఓవర్లో 99 పరుగులకే ఆలౌట్ అయింది. చెన్నై బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 4, రవీంద్ర జడేజా 3, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్ చెరొక వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 4 పరుగుల వద్ద వాట్సన్(0) అక్సర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో కష్టాల్లోపడ్డ జట్టుకు రైనా, డుప్లెసిస్‌ల జోడీ అండగా నిలిచింది.
వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 83 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రైనా హాఫ్ సెంచరీ చేశాడు. దూకుడుగా ఆడుతున్న డుప్లెసిస్(39) ధవన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే రైనా(59) కూడా ధవన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 15 ఓవర్లలో 3 మూడు వికెట్ల నష్టానికి చెన్నై 102 పరుగులు మాత్రమే చేయగలింది.
ఆ తరువాత కేవలం 3.3 ఓవర్లలోనే 43 పరుగులు జోడించిన తరువాత జడేజా(25)ని మోరిస్ ఔట్ చేశాడు. ఆ తరువాత ధోనితో కలిసిన రాయుడు జట్టు స్కోరును 179 పరుగులకు చేర్చాడు. 20 ఓవర్లు ముగిసే సరికి ధోని 44, రాయుడు 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో సుచిత్ 2, మోరిస్, అక్షర్ పటేల్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.