గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (13:22 IST)

రోహిత్ శర్మ ఎందుకిలా చేశాడు.. ధోనీ, కోహ్లీ.. బాటలో ముంబై కెప్టెన్?

కేకేఆర్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. మొన్న ధోని.. నిన్న కోహ్లీ.. తాజాగా రోహిత్‌ శర్మలు మ్యాచ్ ఫీజులో కోత వేసుకున్నారు. అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై ఆటగాళ్లు తమ అసహనాన్ని మైదానంలోనే వ్యక్తపరుస్తున్నారు. ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 233 పరుగుల భారీ లక్ష్యంతో ముంబయి ఇండియన్స్‌ బరిలోకి దిగింది. 
 
నాలుగో ఓవర్‌ వేసేందుకు కోల్‌కతా ఫాస్ట్‌ బౌలర్‌ గర్నీ బౌలింగ్‌కు వచ్చాడు. ఓవర్‌లో మూడో బంతికి రోహత్‌శర్మను అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. రోహిత్‌ శర్మ ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని కోరాడు. ఆ సమీక్షలో బంతి పిచింగ్‌ ఔట్‌ సైడ్‌లో పడటంతో పాటు లెగ్‌ వికెట్‌ను కొంచెం తాకుతూ వెళ్లినట్లు కనిపించింది. దీంతో థర్డ్‌ అంపైర్‌.. అంపైర్స్‌ కాల్‌కు అవకాశం ఇచ్చాడు. 
 
మైదానంలో అంపైర్‌గా ఉన్న నితిన్‌ మీనన్‌ ఔట్‌గా ప్రకటించడంతో రోహిత్‌ అసహనానికి గురయ్యాడు. బౌలింగ్‌ ఎండ్‌లో ఉన్న అంపైర్‌ దగ్గరికి వచ్చి ఏవో వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా అక్కడున్న వికెట్లను తన బ్యాటుతో కొట్టాడు. దీంతో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద రోహిత్‌శర్మకు మ్యాచ్‌ ఫీజులో 15శాతం కోత పడింది. రోహిత్ శర్మ ఇలా మైదానంలో అసహనానికి గురైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.