గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:27 IST)

అంపైర్ బంతి మరిచిపోతే.. ఎలా వుంటుంది.. (Video)

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌‌లో బెంగళూరు విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. 
 
203 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించలేకపోయింది. చివరి మూడు ఓవర్లు ఎంత ప్రయత్నించినా బౌన్దరీలు కష్టమవడంతో పంజాబ్ చేతులెత్తేసింది. చివరికి 17 పరుగుల తేడాతో కోహ్లీ సేన గెలుపును నమోదు చేసుకుంది.
 
ఇక  బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌‌లో బాల్ కనబడకుండా పోయింది. డివిలియర్స్ కొట్టిన సిక్సుతో బాల్ పోయిందనుకున్నారు చాలామంది. కానీ అంపైర్ మర్చిపోయిన బాల్ గురించే ఇప్పుడు చర్చ. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో స్ట్రాటజిక్ టైం సమయంలో అంపైర్ ఒకరు బంతిని జేబులో వేసుకున్నారు. అయితే స్ట్రాటజిక్ టైం అయ్యాక రాజ్‌పుత్ బౌలింగ్ వేద్దాం అనుకుంటే బంతి లేదు. 
 
అంపైర్లను అడిగినా బంతి లేదన్నారు. అసలు బంతి ఎక్కడికి పోయిందో అర్థం కాలేదు. బంతి దొరకలేదని బయట నుంచి కొత్త బంతిని తెప్పించేలోపు అది ఒక అంపైర్ ప్యాంటు జేబులో ఉందని తెలుసుకొని ఇచ్చేశాడు. ఆ ఘటన చూసి ఆటగాళ్లే కాక ప్రేక్షకులు కూడా నవ్వుకున్నారు.