సన్ రైజర్స్ ఆటగాళ్లకు మినప గారెలు, వడలు రుచి చూపించిన యాంకర్ సుమ
మరికొన్నిరోజులలో ఐపీఎల్ సంరంభానికి తెరలేవనుండడంతో అన్ని జట్ల ఆటగాళ్లు అటు ప్రాక్టీసుతోపాటు ప్రమోషనల్ ఈవెంట్లలోనూ బిజీబిజీగా గడుపుతున్నారు. గతయేడాది రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాళ్లు కూడా తీరికవేళల్లో యాడ్ షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.
కాగా, ప్రముఖ టెలివిజన్ యాంకర్ సుమతో కలిసి ఓ యాడ్ ఫిలిం (తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు?) షూటింగ్‌లో సందడి చేసారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అనే తేడా లేకుండా ఎంతో సరదాగా ఉండే యాంకర్ సుమ డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్ వంటి క్రికెటర్లతో కలిసి ఎంతో ఉత్సాహంగా యాడ్ చిత్రీకరణలో పాల్గొంది.
ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయ వంటకాలైన మినప గారెలు, వడలను ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు వార్నర్‌కు కూడా రుచి చూపించింది. ఈ యాడ్‌లో భాగంగా భువనేశ్వర్ కుమార్ కూడా ఆ రుచికరమైన వంటకాలను టేస్ట్ చేశాడు.
సన్ రైజర్స్ టీమ్‌కు మార్గదర్శిగా వ్యవహరిస్తున్న మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఈ వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సుమ తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేయగా అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు.