1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఐపీఎల్ 2023 : కేకేఆర్ - ముంబై ఇండియన్స్ జట్ల కెప్టెన్లకు అపరాధం

kkr vs mi
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 పోటీల్లో భాగంగా, ఆదివారం ముంబై ఇండియన్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం కేకేఆర్ జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు భారీ జరిమానా పడింది. తొమ్మిదో ఓవర్ తొలి బంతికే షాకీన్ బౌలింగ్‌లో రానా ఐదు పరుగులు చేసి  రమణ్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ముంబై బౌలర్ షాకీన్, రాణాల మధ్య స్వల్ప వివాదం చెలరేగింది. 
 
ఈ సందర్భంగా బౌలర్ షాకీన్‌పై రాణా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా మ్యాచ్ రిఫరీ భావించారు. దీంతో రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తునట్టు ప్రకటించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.21 కింద లెవల్ 1 నేరానికి రాణా పాల్పడినట్టు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, బౌలర్ షోకీన్‌కు పది శాతం అపరాధం విధించారు. 
 
మరోవైపు, ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌కు రూ.12 లక్షల అపరాధం విధిస్తున్నట్టు మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కతా మ్యాచ్‌ సందర్భంగా స్లో ఓవర్ రేట్ కారణంగా సూర్యకుమార్‌కు జరిమానా విధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ (104) సెంచరీ చెలరేగిపోయాడు. 
 
ఈ క్రమంలో ఆయన కాలికి గాయం కావడంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్ ముగింపు సమయం కంటే ఎక్కువ సమయం కొనసాగడంతో కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్య కుమార్‌కు భారీ మొత్తంలో అపరాధం విధింది. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 17.4 ఓవర్లలో 186 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా ఛేధించింది.