ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (12:29 IST)

పాక్‌ను వణికించిన సౌరభ్ నేత్రవాల్కర్.. క్రికెట‌ర్‌, టెక్కీనే కాదు.. మ్యూజిషియ‌న్ కూడా..

Saurabh Netravalkar
Saurabh Netravalkar
ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ను అమెరికా పేసర్ సౌరభ్ నేత్రవాల్కర్ వణికించాడు. ఈ భార‌త సంత‌తి క్రికెట‌ర్ ప్రస్తుతం స్టార్‌గా మారిపోయాడు. అసలు కథేంటంటే..? టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది అమెరికా క్రికెట్ జ‌ట్టు. 
 
తాను ఆడుతోన్న తొలి వ‌ర‌ల్డ్ క‌ప్‌లోనే సంచ‌ల‌నాల‌ను సృష్టించింది. ఈ మ్యాచ్‌తో అమెరికా పేస‌ర్ సౌర‌భ్ నేత్ర‌వాల్క‌ర్ హీరోగా మారిపోయాడు. ఈ భార‌త సంత‌తి క్రికెట‌ర్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవ‌ర్లు వేసి కేవ‌లం ప‌ద్దెనిమిది ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు సౌర‌భ్ నేత్ర‌వాల్క‌ర్‌. ఆ త‌ర్వాత సూప‌ర్ ఓవ‌ర్‌లోనూ పాకిస్థాన్‌ను అద్భుతంగా క‌ట్ట‌డిచేశాడు. 
 
సూప‌ర్ ఓవ‌ర్‌లో ఓ వికెట్ తీశాడు. తద్వారా అమెరికాకు అద్భుత విజయాన్ని సాధించిపెట్టాడు. 1991 అక్టోబ‌ర్ 16న ముంబ‌యిలో జ‌న్మించిన సౌర‌భ్ నేత్ర‌వాల్క‌ర్ టీమ్ ఇండియా త‌ర‌ఫున 2010లో అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు సెలక్ట్ అయ్యాడు. 
 
కేఎల్ రాహుల్‌, జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్‌, మ‌యాంక్ అగ‌ర్వాల్‌ల‌తో క‌లిసి వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడాడు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాకిస్థాన్ త‌ర‌ఫున బాబ‌ర్ అజాం బ‌రిలో దిగాడు. అప్పుడు పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓట‌మి పాలైంది. 
 
ఈ మ్యాచ్‌లో ఎదురైన ఓట‌మికి అమెరికా జ‌ట్టు త‌ర‌ఫున ప‌ధ్నాలుగేళ్ల త‌ర్వాత బాబ‌ర్ అజాంపై రివేంజ్ తీర్చుకున్నాడు సౌర‌భ్ నేత్ర‌వాల్క‌ర్‌. ఓ వైపు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూనే క్రికెట్‌పై ఫోక‌స్ పెట్టిన సౌర‌భ్ ప‌లు అమెరికాలో ప‌లు లీగ్ మ్యాచ్‌లు ఆడాడు. 
 
2019లో అమెరికా నేష‌న‌ల్ టీమ్‌కు సెలెక్ట్ అయిన సౌర‌భ్ త‌న బౌలింగ్ టాలెంట్‌తో జ‌ట్టుకు కొద్ది కాలంలోనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అలాగే  అమెరికాలో జ‌రిగిన మేజ‌ర్ క్రికెట్ లీగ్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచాడు. 
 
క్రికెట‌ర్‌, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గానే కాకుండా సౌర‌భ్ నేత్ర‌వాల్క‌ర్‌లో మంచి మ్యూజిషియ‌న్ ఉన్నాడు. ఉకులేలేను వాయిస్తూ ఓం న‌మః శివాయ అంటూ సౌర‌భ్ నేత్ర‌వాల్క‌ర్ పాడిన అమెరికా, పాకిస్థాన్ మ్యాచ్ త‌ర్వాత ట్రెండింగ్‌గా మారింది.