శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (17:04 IST)

భారత్‌తో వన్డే సిరీస్ : న్యూజిలాండ్‌ జట్టు ఇదే

స్వదేశంలో పర్యాటక భారత్ జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్ కోసం సిద్ధమైంది. ఇందుకోసం కివీస్ జట్టును ప్రకటించింది. అయితే, ఈ వన్డే సిరీస్‌కు ముందు కివీస్‌ జాతీయ జట్టులోని సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్లు గాయాలతో భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో అందుబాటులో ఉన్న వారితో జట్టును ప్రకటించారు.
 
కాగా, ఆతిథ్య కివీస్‌, భారత్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ ఫిబ్రవరి 5వ తేదీన తొలి వన్డే మ్యాచ్ హామిల్టన్ వేదికగా జరుగనుంది. 14 మంది ఆటగాళ్లతో కూడిన వన్డే జట్టును న్యూజిలాండ్‌ సెలక్టర్లు గురువారం ప్రకటించారు. ఈ వన్డే సిరీస్ ద్వారా కైల్‌ జామిసన్‌ పరిమిత ఓవర్ల క్రికెట్లోకి అరంగేట్రం చేయనుండగా.. స్కాట్‌ కుగెలిన్‌, హమీష్‌ బెనెట్‌ చాలా రోజుల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. 
 
టీమ్‌ సౌథీ పేస్‌ భారాన్ని మోయనున్నాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, లాకీ ఫర్గుసన్‌, మాట్‌ హెన్రీ గాయాలతో సిరీస్‌కు దూరమయ్యారు. ఆఖరి రెండు టీ20లకు జట్టులో లేని గ్రాండ్‌హోం వన్డే టీమ్‌లో చోటుదక్కించుకున్నాడు. జిమ్నీ నీషమ్‌, మిచెల్‌ సాంట్నర్‌ ఆల్‌రౌండ్‌ కోటాలో బరిలో దిగనున్నారు. ఇష్‌ సోధీని కేవలం తొలి వన్డే కోసం మాత్రమే ఎంపిక చేశారు. ఈ వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టు వివరాలను పరిశీలిస్తే, 
 
వన్డే జట్టు :
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), హమీశ్‌ బెనెట్‌, టామ్‌ బ్లండెల్‌, కోలిన్‌ గ్రాండ్‌హోం, మార్టిన్‌ గప్తిల్‌, కైల్‌ జామీసన్‌, స్కాట్‌ కుగెలిన్‌, టామ్‌ లాథమ్‌, జిమ్మీ నీషమ్‌, హెన్రీ నికోల్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, ఇష్‌ సోధీ, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌.