శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (13:16 IST)

హిందూ క్రికెటర్‌తో కలిసి భోజనం చేయని పాక్ క్రికెటర్లు

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఒకరు లేదా ముగ్గురు హిందూ మతానికి చెందిన క్రికెటర్లు ఉండేవారు. అలాంటివారిలో డానిష్ కనేరియా ఒకరు. పాకిస్థాన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే, అతను సహచర జట్టు సభ్యుల నుంచి తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నట్టు అదే జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిని బాధిత క్రికెటర్ కూడా సమర్థించాడు. 
 
పాక్ జట్టులోని వివక్షపై షోయబ్ అక్తర్ స్పందిస్తూ, తమ జట్టులో హిందువు అయిన స్పిన్నర్‌ డానిష్‌ కనేరియాపట్ల పాకిస్థాన్‌ జట్టులోని కొందరు క్రికెటర్లు తీవ్ర వివక్ష చూపారన్నారు. అతడితో కలిసి భోజనం చేసేందుకూ వారు నిరాకరించారని తెలిపారు. 
 
'నేను ఆడే సమయంలో జట్టులో ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు ప్రాంతీయతత్వం ప్రదర్శించేవారు. ఎవరు కరాచీ, ఎవరు పంజాబీ, ఎవరు పెషావర్‌ అని మాట్లాడేవారు. వీరిపై నేను ఎంతో పోరాడా. పాకిస్థానీయుల గురించే అలా మాట్లాడేవారంటే ఇక జట్టులో హిందువు పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి. కనేరియా మాకు ఎన్నో విజయాలు అందించాడు. కానీ అతడిని ప్రశంసించడానికి బదులు.. కనేరియా ఈ దేశంలో ఎలా జీవిస్తున్నాడు అని మా జట్టులోని ఆటగాళ్లు తప్పుపట్టేవారు' అని వెల్లడించారు. 
 
ఈ వ్యాఖ్యలను కనేరియా సమర్థించాడు.'నేనాడే రోజుల్లో నాపై వివక్షపై మాట్లాడేందుకు సాహసించలేదు. ఇప్పుడు షోయబ్‌ చెప్పిన విషయాలు నిజమే' అని చెప్పుకొచ్చాడు. కాగా, కనేరియా 61 టెస్టు మ్యాచ్‌లు ఆడి 261 వికెట్లు తీశాడు.