మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ : గంగూలీ ప్రశంసలు

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం రాత్రి అధికారికంగా ఒక ప్రకటన చేసింది. 
 
టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఆయన స్థానంలో ద్రావిడ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ద్రావిడ్ స్పందిస్తూ... రవిశాస్త్రి కోచ్‌గా టీమిండియా అద్భుతమైన విజయాలను సాధించిందని కితాబునిచ్చారు. ఆటగాళ్లందరి సహకారంతో విజయాల పరంపరను తాను కూడా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు.
 
మరోవైపు, టీమిండియాకు కోచ్‌గా ద్రవిడ్‌ నియామకంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. టీమిండియా హెడ్‌కోచ్‌గా ద్రావిడ్‌ను స్వాగతిస్తున్నామని చెప్పారు. సుదీర్ఘమైన ప్లేయింగ్ కెరియర్ ద్రావిడ్ సొంతమన్నారు. క్రికెట్ చరిత్రలోని దిగ్గజాలలో ద్రావిడ్ ఒకరని కొనియాడారు.
 
నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ) హెడ్‌గా ద్రావిడ్ అద్భుతమైన సేవలందించారన్నారు. ద్రావిడ్ నేతృత్వంలో ఎందరో యంగ్ ప్లేయర్స్ భారత జట్టుకు ఎంపికై, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని అన్నారు. 
 
ద్రావిడ్ మార్గదర్శకత్వంలో టీమిండియా ఎన్నో విజయాలను సాధిస్తుందని... భారత క్రికెట్ ను ద్రావిడ్ అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తాడనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.