దంచికొట్టిన ఓపెనర్లు... రాజస్థాన్‌పై బెంగుళూరు ఘన విజయం
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా, రాజస్థాన్ రాయల్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఘన విజయం సాధించింది. ఆ జట్టు ఓపెనర్లు రాణించడంతో 9 వికెట్లు తేడాతో విజయభేరీ మోగించింది. బెంగుళూరు జట్టు ఓపెనర్లు సాల్ట్ 33 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 65 పరుగులు చేయగా, మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ నిర్దేశించిన 174 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగుళూరు జట్టు 17.3 ఓవర్లలో ఛేదించింది.
లక్ష్య ఛేదనలో భాగంగా, బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు మొదటి ఓవర్ నుంచే రాజస్థాన్ జట్టుపై ఎదురుదాడికి దిగింది. ఒకవైపు సాల్ట్, మరోవైపు, విరాట్ కోహ్లీ ఫోర్లు, సిక్స్‍లు కొడుతూ పరుగుల వరద పారించారు. వీళ్లిద్దరి దూకుడు చూస్తే మొత్తం టార్గెట్‌ను వీళ్లే పూర్తి చేసేలా కనిపించారు. ఈ క్రమంలో కార్తికేయ వేసిన బంతిని ఫిలిఫ్ సాల్ట్... యశస్వికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ 28 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 40 పరుగులు చేయగా, కోహ్లీతో కలిసి మ్యాచ్‌ను ముగించాడు. రాజస్థాన్ బౌలర్లలో కార్తికేయకు ఒక వికెట్ దక్కింది. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ఫిలిప్ సాల్ట్ ఎంపికయ్యాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జైశ్వాల్ 47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 75 పరుగులు చేయగా, చివరులో ధృవ్ జురెల్ 35, కెప్టెన్ సంజు 15, రియాన్ పరాగ్ 30, హిట్ మెయర్ 9, నితీశ్ రాణా 4 చొప్పున పరుగులు చేశారు. బెంగుళూరు బౌలర్లలో యశ్, హెజిల్‌వుడ్, కృనాల్, భువనేశ్వర్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.