బుధవారం, 26 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 మార్చి 2025 (20:09 IST)

ఐపీఎల్ టోర్నీ : సొంతగడ్డపై బోణీ కొట్టిన హైదరాబాద్ సన్ రైజర్స్

hyd sun risers
ఐపీఎల్ 2025 సీజన్ పోటీల్లో భాగంగా, ఆదివారం సొంతగడ్డ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 286 పరుగులు చేసింది. ఆ తర్వాత 287 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఐదు వికెట్లను కోల్పోయి 242 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ జట్టులో జైశ్వాల్ (1), రియాన్ పరాగ్ (4), నితీశ్ రాణా (11)లు నిరాశపరచగా, సంజు శాంసన్ (66), జురేల్ (70), దూబే (34), హిట్ మేయర్ (42) చొప్పున పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. అంతకుముందు హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. 
 
ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ... సన్ రైజర్స్ 286 రన్స్ 
 
సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆటగాడు ఇషాన్ కిషన్ ఉప్పల్ స్టేడియంలో రెచ్చిపోయాడు. కేవలం 47 బంతుల్లో సెంచరీ (106) బాదేశాడు. ఫలితంగా ఆ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. గత యేడాది ఐపీఎల్ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ అత్యధిక స్కోరు చేసింది. ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగా, ఇపుడు 286 పరుగులు చేసింది. ఇందులో ఇషాన్ కిషన్ చేసిన 106 పరుగులు ఉన్నాయి. ఈ సీజన్‌లో తొలి సెంచరీ చేసిన క్రికెటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. 
 
ఆదివారం ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఆటగాళ్లు ఓ రేంజ్‌లో మైదానంలో విధ్వంసం సృష్టించారు. ఎడమచేతివాటం ఆటగాడైన ఇషాన్ కిషన్ ఏకంగా 11 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో రెచ్చిపోయాడు. అత్యంత వేగంగా బౌలింగ్ చేస్తాడన్న పేరున్న ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో ఏకంగా రెండు సిక్సర్లు బాదాడు. 
 
మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేయగా, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 11 బంతుల్లో ఐదు ఫోర్లతో 24 రన్స్ చేశాడు. తెలుగుతేజం నితీశ్ రెడ్డి 15 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 30 పరుగులు చేశాడు. హెన్రిచ్ 34 రన్స్ చేశాడు. 
 
రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 3, మహిశ్ తీక్షణ 2, సందీప్ శర్మ ఒక వికెట్ చొప్పున తీశాడు. స్టార్ బౌలర్ జోఫ్రా అర్చర్ నాలుగు వేసి ఏకంగా 76 పరుగులు సమర్పించుకోవడమేకాకుండా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆర్చర్ బౌలింగ్‌లో బ్యాటర్లు వీరవిహారం చేశారు.