గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (13:50 IST)

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా రమీజ్ రాజాకు ఉద్వాసన

ramiz raja
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస ఓటములను చవిచూస్తుంది. ఈ జట్టు వైఫల్యాలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా మెడకు చుట్టుకుంది. చివరకు ఆయన పదవికి ఎసరు పెట్టింది. రమీజ్ రాజాను క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని ఆదేశాలు జారీచేశారు. అదేసమయంలో కొత్త ఛైర్మన్‌గా నజీమ్ సేథీని నియమించారు. రమీజ్ రాజా 15 నెలల పాటు పీసీబీ ఛైర్మన్‌గా ఉన్నారు. 
 
ఇదిలావుంటే, పాకిస్థాన్ జట్టు స్వదేశంలో ఆడిన క్రికెట్ సిరీస్‌లతో పాటు విదేశీ గడ్డలపై జరిగిన సిరీస్‌లలో కూడా ఓడిపోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్ సిరీస్‌లో పిచ్‌ల తయారీపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది రమీజ్ రాజా ఉద్వాసనకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 
 
పాకిస్థాన్ ప్రధాని పీసీబీకి ప్యాట్రన్ ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. దీంతో రమీజాను తొలగించి, ఆయన స్థానంలో నజీమ్ సేథీకి బాధ్యతలు అప్పగించినట్టు ప్రధాని పేరుమీద విడుదలైన ఓ ప్రకటన వెల్లడించింది. 
 
మరోవైపు, నజీమ్ సేథీ పీసీబీ సీఈవోగా 2013 నుంచి 2018 వరకు సేవలు అందించారు. అయితే 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు.