హమ్మయ్య ఆర్సీబీ విజయం - ఆర్ఆర్‌కు ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టతరం
ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ పోటీల్లో ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (30 బంతుల్లో 50 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్స్)తో మెరుపులు మెరిపించడంతో ఆర్‌సీబీ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 150 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. అంతకముందు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరువ కాగా, ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు మరింత కష్టమయ్యాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆరంభంలో ఎవిన్ లూయిస్ ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు ఖాయం అనుకున్న దశలో రాజస్థాన్ మాత్రం నామమాత్రపు స్కోరు మాత్రమే చేసింది.
ముఖ్యంగా, లూయిస్ ఔటైన తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్స్ పూర్తిగా విఫలమయ్యారు. 13 ఓవర్లు ముగిసేసరికి 113/2తో పటిష్టంగా కనిపించిన రాజస్థాన్ మిగిలిన 7 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చహల్, షాబాజ్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీశారు.
రాజస్థాన్‌ను తొలుత 149 పరుగులకు కట్టడి చేసిన కోహ్లీ సేన గ్లెన్ మ్యాక్స్‌వెల్, శ్రీకర్ భరత్ మెరుపులతో మరో 2.5 ఓవర్లు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది. మ్యాక్స్‌వెల్ 30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 50 పరుగులు చేయగా, 35 బంతులు ఎదుర్కొన్న భరత్ 3 ఫోర్లు, సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు. కోహ్లీ 25, పడిక్కల్ 22 పరుగులు చేయడంతో సునాయాస విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన చాహల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు హైదరాబాద్-చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది.