గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జనవరి 2024 (10:19 IST)

కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకున్న సానియా మీర్జా

sania mirza
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా వైవాహిక బంధం అర్థాంతరంగా ముగిసింది. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చారు. ఈ విషయం తాజాగా వెల్లడైంది. కొన్ని నెలల క్రితమే సానియా మీర్జానే తన భర్తకు విడాకులు ఇచ్చినట్టు వెలుగులోకి వచ్చింది. భర్తకు ఏకపక్షంగా విడాకులు ఇచ్చేలా ముస్లిం మహిళలకు ఉండే హక్కు ఖులా చట్టం ప్రకారం షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని సానియా కుటుంబ వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ విషయంపై సానియా టీమ్‌, కుటుంబం ఆదివారం అధికారికంగా స్పందించాయి. 'సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టి నుంచి దూరంగానే ఉంచింది. కానీ ఇప్పుడు షోయబ్‌, ఆమె కొద్ది నెలల కిందటే విడాకులు తీసుకున్నారని చెప్పాల్సిన అవసరం సానియాకు కలిగింది. కొత్త ప్రయాణంలో షోయబ్‌కు మంచి జరగాలని ఆమె కోరుకుంటోంది. ఆమె జీవితంలోని ఈ సున్నితమైన పరిస్థితుల్లో అభిమానులు, శ్రేయోభిలాషులు ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరుతున్నాం. ఆమె గోప్యతను గౌరవించాల్సిన అవసరం ఉంది అని ఓ ప్రకటనలో సానియా టీమ్‌, కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

షోయబ్ మాలిక్ నుంచి ఖులా కోరిన సానియా మీర్జా.. ఖులా అంటే... 
 
భారత టెన్నిస్ మాజీ ప్లేయర్ సానియా మీర్జా తన భర్త, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడిపోయారు. షోయబ్ మాలిక్ తాజాగా ప్రముఖ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో షోయబ్ మాలిక్ నుంచి సానియా మీర్జా 'ఖులా' ఎంచుకుందని ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా ధ్రువీకరించారు. ఈ మేరకు శనివారం మీడియాకు వెల్లడించారు. 'ఇది ఒక 'ఖులా'. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు' అని ఇమ్రాన్ మీర్జా అన్నారు. ఇంతకీ 'ఖులా' అంటే ఏమిటి?, తలాకికి, దీనికి వ్యత్యాసం ఏంటో గమనిద్దాం.
 
ఖులా అంటే ఏమిటి? 
ఒక ముస్లిం పురుషుడు 'తలాక్' ద్వారా ఏవిధంగా ఏకపక్షంగా విడాకులు ఇస్తాడో.. ముస్లిం స్త్రీలకు కూడా ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కే 'ఖులా'. భర్త నుంచి విడాకుల ప్రక్రియను భార్య ప్రారంభించడాన్ని 'ఖులా' సూచిస్తుంది. దీని ద్వారా భార్యలు వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. విడిపోయాక పిల్లల చదువులు, ఆర్థికసాయం అందించే బాధ్యత భర్తదేనని 'ఖులా' చెబుతుంది. పిల్లలు సాధారణంగా ‘హిజానత్' వయస్సు వచ్చే వరకు తల్లి వద్దే ఉంటారని 'ఖులా' చెబుతోంది. కొడుకుల వయసు ఏడేళ్లు, కూతుళ్లకు యుక్తవయస్సు వచ్చే వరకు తల్లి వద్ద ఉంటారని తెలియజేస్తోంది.
 
కాగా షోయబ్ మాలిక్, సానియా మీర్జా ఏప్రిల్ 2010లో హైదరాబాద్ నగరంలో వివాహం చేసుకున్నారు. దుబాయ్‌లో నివాసం ఉండేవారు. వీరిద్దరి మధ్య సఖ్యత లేదనే విషయంపై సానియా మీర్జా ఎప్పుడూ నేరుగా మాట్లాడకపోయినప్పటికీ ఆమె సోషల్ మీడియా పోస్టులు అనుమానం కలిగించే విధంగా ఉండేవి. వారంక్రితం కూడా ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఆమె ఇలాంటి పోస్ట్ పెట్టారు. 
 
'మీ మనస్సు ప్రశాంతకు ఏదైనా భంగం కలిగిస్తుంటే దానిని అలా వదిలిపెట్టండి' అని రాసుకొచ్చారు. మరో పోస్టులో "పెళ్లి కష్టం. విడాకులు తీసుకోవడం కష్టం. మీ కష్టాన్ని ఎంపిక చేసుకోండి. స్థూలకాయం కష్టం. ఫిట్‌గా ఉండటం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి. అప్పులు ఉండటం కష్టం. ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కష్టం. మీ కష్టాన్ని ఎంచుకోండి. మాట్లాడడం కష్టం. మాట్లాడుకోకపోవడం కష్టం. జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. తెలివిగా కష్టాన్ని ఎంచుకోండి' అని రాసుకొచ్చారు.