విశ్వవిజేతగా ఆ జట్టే అవతరిస్తుంది : రావల్పిండి ఎక్స్‌ప్రెస్ జోస్యం
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ పోరు ఆదివారం జరుగనుంది. ఈ సమరంలో ఆతిథ్య ఇంగ్లండ్ - న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. సమ ఉజ్జీలుగా ఉన్న ఇరు జట్ల మధ్య జరిగే ఈ పోరు అమితాసక్తిగా మారనుంది. ఈ నేపథ్యంలో తుది పోరులో విశ్వవిజేత ఎవరన్నదానిపై మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా గుర్తింపు పొందిన షోయబ్ అక్తర్ జోస్యం చెప్పాడు.
ఇదే అంశంపై అక్తర్ స్పందిస్తూ, ఈ సెమీ ఫైనల్ పోరులో ఇంగ్లండ్ విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. ఒకవేళ టాస్ గెలిచిన ఇంగ్లండ్, తొలుత బ్యాటింగ్ తీసుకుంటే విజయావకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయన్నాడు. జట్టుకు బలమైన పునాది ఇవ్వాల్సిన బాధ్యత మార్టిన్ గుప్టిల్, హెన్రీ నికోలస్‌లపైనే ఉందని అన్నారు.
తాను న్యూజిలాండ్‌కు కూడా మద్దతిస్తానని, అయితే, ఫైనల్ ఫేవరెట్ మాత్రం ఇంగ్లండేనని అన్నాడు. సొంత గడ్డపై ఆడుతుండటం ఆ జట్టుకు అదనపు బలమని చెప్పాడు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకుంటుందని భావించడంలో సందేహం లేదన్నాడు. మరి మరికొన్ని గంటల్లో క్రికెట్ విశ్వవిజేత ఎవరో తేలిపోనుంది.