సోమవారం, 30 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (09:07 IST)

ధర్మశాల టీ20లో భారత్ విజయం - సిరీస్ క్లీన్ స్వీప్

స్వదేశంలో పర్యాటక శ్రీలంక జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. శ్రీలంక నిర్దేశించిన 146 విజయలక్ష్యాన్ని 16.5 ఓవర్లలో ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ముఖ్యంగా, దినేశ్ చాందిమల్ 25 పరుగులు చేయగా, కెప్టెన్ షనక శివాలెత్తిపోయారు. కేవలం 38 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. 
 
ఇందులో 9 ఫోర్లు, 2 సిక్సర్లు కూడా ఉన్నాయి. అయితే, లంక ఓపెనర్లు నిస్సాంక 1, గుణతిలక 0, చలక్ అసలంక 4, లియనాగే 9 చొప్పున పరుగులు చేసి పూర్తిగా విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, సిరాజ్ 1, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 147 పరగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు... 16.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఆటగాళ్లలో మంచి ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ మరోమారు అర్థ సెంచరీతో రాణించాడు. అయ్యర్ 45 బంతుల్లో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 9 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది. 
 
అదేవిధంగా రవీంద్ర జడేజా 15 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలించారు. ఓపెనర్ సంజు శాంసన్ 18 దీపక్ హుడా 21, వెంకటేష్ అయ్యర్ 5 చొప్పున పరుగులు చేశారు. లంక బౌలర్లలో లహిరు కుమార 2, చమీర, కరుణరత్నేలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఈ విజయంతో భారత్ 3-0 తేడాతో సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసింది.