సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ రిటైర్మెంట్ - నాకుటుంబమే సర్వస్వం
దక్షిణాఫ్రికాకు చెందిన బ్యాట్స్‌మెన్ క్వింటాన్ డికాక్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. గురువారం టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన తన రిటైర్మెంట్‌పై ప్రకటన చేశారు. తన కుటుంబ సభ్యులతో అధిక సమయం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆయన భార్య నాషా త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనుంది. ఆమెతో వెన్నంటి ఉండేందుకు వీలుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాగా, 2014లో టెస్టులో అరంగేట్రం చేసిన డికాక్ ఇప్పటివరకు మొత్తం 54 టెస్టుల్లో ఆరు సెంచరీలు, 22 అర్థ సెంచరీలతో 3300 పరుగులు చేశాడు. సగటు 38.32 శాతం. ఇదిలావుంటే, ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ పోటీల్లో మోకాలిపై కూర్చొని నివాళి అర్పించాలని బోర్డు కోరగా, ఆ మ్యాచ్‌కు డికాక్ దూరమయ్యారు. ఆ తర్వాత బోర్డుకు సారీ చెప్పారు. అలాగే, సౌతాఫ్రికా తరపున 3 వేలకు పైగా పరుగులు సాధించిన రెండో వికెట్ కీపర్‌గా డికాక్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఆ ఫీట్‌ను మార్క్ బౌచర్ మాత్రమే సాధించారు.
తన రిటైర్మెంట్‌పై డికాక్ మాట్లాడుతూ, "ఈ నిర్ణయం అంత ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. నా భవిష్యత్ గురించి బాగా ఆలోచించాను. ఏది ముఖ్యమో?, ఏది కాదో? బేరీజు వేసుకున్నాను. మా జీవితంలోకి తొలి బిడ్డ రాబోతుంది. మా కుటుంబం మరింత పెద్దదవుతోంది. నా కుటుంబమే నాకు సర్వస్వం. అలాంటి కుటుంబం కోసమే వీలైనత ఎక్కువ సమయాన్ని కేటాయించాలనుకుంటున్నా. టెస్ట్ క్రికెట్ అంటే నాకు ఎంతో ఇష్టం. నా దేశం తరపున ఆడటం గర్వంగా భావిస్తా. ఇన్నేళ్ళ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను" అంటూ డికాక్ భావోద్వేగంతో చెప్పారు.