వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్!!
చాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓటమి అనంతరం ఆసీస్ జట్టులోని స్టార్ ఆటగాడు, ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ వన్డే క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మిత్ 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా కూడా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓటమిపాలైంది.
35 యేళ్ళ స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా తరపున మొత్తం 170 వన్డేలు ఆడాడు. 86.96 స్ట్రైక్ రేట్, 43.28 సగటుతో 5,800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన 12వ ఆటగాడిగా తన కెరీర్‌ను స్మిత్ ముగించాడు. ఇక వన్డేల్లో స్మిత్ అత్యధికంగా వ్యక్తిగత స్కోరు 164 కాగా, 2014లో న్యూజిలాండ్‌పై ఈ స్కోరు నమోదు చేశాడు. లెగ్ స్పిన్నిగ్ ఆల్‌రౌండర్‌గా అరంగేట్రం చేసిన స్మిత్ తన కెరీర్‌లో 28 వికెట్లు తీశాడు.
ఇదిలావుంటే చాంపియన్స్ ట్రోఫీ కోసం రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చీలమండ గాయంతో జట్టుకు దూరం కావడంతో స్మిత్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. అయితే, ఆ జట్టు దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీస్ మ్యాచ్‌లో ఓడిపోయింది.