మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (09:59 IST)

అండర్ 19 వరల్డ్ కప్ : పాక్‌పై భారత్ ఘన విజయం

న్యూజిలాండ్‌లోని క్రెస్ట్ చర్చ్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత కుర్రోళ్ళు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేశారు. భారత యువ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కుర్రోళ్లు పెవ

న్యూజిలాండ్‌లోని క్రెస్ట్ చర్చ్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత కుర్రోళ్ళు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేశారు. భారత యువ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కుర్రోళ్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ ఆటగాళ్లు అతి తక్కువ స్కోరుకే ఇంటిదారి పట్టారు. పాక్ ఆటగాళ్ళు 2, 7, 18, 1, 4, 4, 15, 1, 0, 1... ఇలా అతి తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యారు. ఫలితంగా భారత్ 203 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
నిజానికి అండర్-19 ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కప్పును ఒడిసిపట్టుకోవాలన్న కసితోనే భారత్ ఆటగాళ్లు రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన సెమీస్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన పృథ్వీ సేన దాయాదీ జట్టును 203 పరుగుల భారీ తేడాతో ఓడించింది. తద్వారా ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ అజేయ శతకంతో పాటు బ్యాట్స్‌మన్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ పృథ్వీషా(41), మంజోత్(47) జట్టుకు శుభారంభం ఇచ్చారు. 
 
ఆ తర్వాత 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి 29.3 ఓవర్లలో కేవలం 69 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారంటే భారత బౌలర్లు ఏ రీతిలో చెలరేగారో అర్థం చేసుకోవచ్చు. 
 
పాక్ జట్టులో ఇమ్రాన్ 2, జయీద్ 7, నజీర్ 18, జార్యాబ్ 1, అమ్మద్ 4, తాహా 4, సాద్ 15, హసన్ 1, షహీన్ 0, అర్షాద్ 1 పరుగు చేయగా, మూసా 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వారి ఇన్నింగ్స్‌లో నజీర్ చేసిన 18 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్ 4, శివ సింగ్, రియాన్ పరాగ్ 2, అనుకుల్ రాయ్, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్ మ్యాచ్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.