ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (12:16 IST)

తీవ్ర ఆర్థిక కష్టాల్లో వినోద్ కాంబ్లీ... ఇంటిని కోల్పోయే స్థితిలో...

vinod kambli
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాడు. ఫలితంగా ఆయన ఇపుడు తన ఇంటిని సైతం కోల్పోయే ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికిగురైన వినోద్ కాంబ్లీ ఆస్పత్రిలో చేరి రెండు వారాలపాటు చికిత్స చేయించుకుని తిరిగి కోలుకున్నాడు. దీంతో వైద్యులు బుధవారం కాంబ్లీని డిశ్చార్జ్ చేశారు. అయితే, వినోద్ కాంబ్లీ ఇపుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 
 
గత ఆరు నెలలుగా కాంబ్లీ మొబైల్ ఫోన్ లేకుండా గడుపుతున్నాడు. కాంబ్లీకి ఫోన్ ఉండేదని, కానీ ఆ మొబైల్ ఫోన్ రిపేరు ఫీజు రూ.15 వేలు చెల్లించకపోవడంతో దుకాణదారుడు దానిని తీసుకెళ్లాడని ఓ మీడియా చానెల్ పేర్కొంది. ఇపుడు ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ ప్రస్తుతం ఆర్థికంగా కష్టపడుతున్నట్టు తెలిపింది. 
 
బీసీసీఐ నుంచి కాంబ్లీకి నెలకు రూ.30 వేల పెన్షన్ వస్తుంది. అలాగే, ఇటీవల ఓ రాజకీయ పార్టీ కాంబ్లీకి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసింది. అయినప్పటికీ ఆయన కష్టాల్లో తీరేలా లేవు. దీనిపై కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్ మాట్లాడుతూ, ప్రస్తుతం తమ హౌసింగ్ సొసైటీ నిర్వహణ ఖర్చుల కింద రూ.18 లక్షలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది. ఒకవేళ ఆ రుసుము చెల్లించని పక్షంలో తాము తమ ఇంటిని కోల్పోయే అవకాశం ఉందన్నారు. 
 
అలాగే, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతూ వినోద్ కాంబ్లీ మీడియాతో మాట్లాడుతూ, మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసాడు. ఈ రెండూ జీవితాన్ని నాశనం చేస్తాయని పేర్కొన్నాడు. కాగా, కాంబ్లీ ఇపుడు పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నాడని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అతనికి చికిత్స చేసిన డాక్టర్ వివేక్ త్రివేది వెల్లడించారు.