ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (10:41 IST)

వైజాగ్ క్రికెటర్ ఆసీస్ లెజెండ్ ప్రశంసలు... నితీశ్ ఐసీసీ ర్యాంకు ఎంతో తెలుసా?

Nitish Kumar Reddy
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ 189 బంతుల్లో 11 ఫోర్లు ఓ సిక్స్ సాయంతో 114 పరుగులు చేసి తాను ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసి క్రికెట్ పండితులను ఆశ్చర్యపోయేలా చేశాడు. దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్ మైఖేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. 
 
ఈ కుర్రాడు జీనియర్, సిరీస్‌లో అంచనాల్లేకుండా బరిలోకి దిగి రాణిస్తున్నాడంటూ కితాబిచ్చాడు. 21 యేళ్ళ వయసులోనే టీమిండింయాకు ప్రధాన బ్యాటర్‌లా మారిపోయాడన్నాడు. నితీశ్‌ ఏ ఆస్ట్రేలియన్ బౌలర్‌కు భయపడలేదని అన్నాడు. ఓపికగా ఉండాల్సిన తరుణమంలో ఓర్పును ప్రదర్శించాడని గుర్తు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ పాటు ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడని, ఆసీస్‌తో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌లో నితీస్ కుమార్ రెడ్డి కీలక ఆటగాడు అవుతాడని మైఖేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. 
 
మరోవైపు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టాడు. 528 రేటింగ్ పాయింట్లతో 20 స్థానాలు ఎగబాకి 53వ స్థానానికి చేరుకున్నాడు. అరంగేట్ర సిరీస్‌లోనే ఆకట్టుకుంటున్న ఈ యువ ఆల్ రౌండర్ టాప్-10 భారత బ్యాటర్ల జాబితాలో చోటుదక్కించుకున్నాడు.
 
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో శతకాన్ని సాధించిన నితీశ్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో భారత అగ్రశ్రేణి క్రికెటర్ల ర్యాంకులు భారీగా దిగజారాయి. ఐసీసీ టాప్-10 ర్యాంకుల్లో భారత్ నుంచి యశస్వీ జైస్వాల్ మాత్రమే నిలిచాడు. బాక్సింగ్ డే టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 80 ప్లస్ పరుగులు సాధించిన ఈ యువ ఆటగాడు 4వ స్థానంలో నిలిచాడు. జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి మినహా మిగతా బ్యాటర్లు అందరి స్థానాలు భారీగా దిగజారాయి.