మా ప్రేమ స్కూల్ మొత్తానికి తెలుసు.. అశ్విన్ సతీమణి ప్రీతి
రవిచంద్రన్ అశ్విన్ భారత క్రికెట్ జట్టులో ప్రముఖ స్పిన్నర్. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అశ్విన్ తన స్నేహితురాలు ప్రీతిని ప్రేమించి 2011లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
తాజాగా అశ్విన్ భార్య ప్రీతి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దీనికి సానియా మీర్జా, వేద కృష్ణమూర్తి హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రీతీని ఆమె ప్రేమ జీవితం గురించి అడిగారు. ఇందుకు ఆమె సమాధానం చెప్తూ.. "అశ్విన్, నేను ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. అప్పటి నుంచి మేం ఒకరికొకరం తెలుసు. తర్వాత మేం పెరిగి పెద్దవాళ్లం అయ్యాం. నేను ఒక కంపెనీలో పని చేసేదానిని. అశ్విన్‌కి నాపై విపరీతమైన ప్రేమ ఉంది. అది స్కూల్ మొత్తానికి తెలుసు.
క్రికెట్ కోసం పాఠశాలలను మార్చాడు. అప్పటికీ ఇద్దరం టచ్‌లో ఉన్నాం. బర్త్‌డేలు సహా ఈవెంట్స్‌లో కలిశాం. నేను చెన్నై సూపర్ కింగ్స్ జట్టును నిర్వహిస్తున్నప్పుడు నేను అతనిని మళ్లీ కలిశాను. అప్పుడే నేను అతనిని ఆరడుగుల ఎత్తులో చూశాను.
ఒకసారి నన్ను క్రికెట్ గ్రౌండ్‌కి తీసుకెళ్లాడు. ఏ విషయాన్నైనా సూటిగా చెప్పేవాడు. ఆ సమయంలోనే లవ్ ప్రపోజ్ చేశాడు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. పదేళ్లుగా మారలేదన్నాడు... ఇలా తమ ప్రేమ పెళ్లి వరకు వచ్చిందని.. జీవితాంతం ఆ ప్రేమ నిలిచివుంటుందని అశ్విన్ సతీమణి వెల్లడించారు.