సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:55 IST)

టీ-20 ప్రపంచ కప్‌.. వీసాపై పాకిస్థాన్ వార్నింగ్.. లేకుంటే అలా చేస్తుందట!?

భారత్ ఆతిథ్య మిస్తున్న ట్వంటీ-20 ప్రపంచ కప్‌ కోసం క్రికెట్ జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటి నుంచే వీసా సమస్య గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరికల్ని షూరూ చేసింది. ఇప్పటి వరకు పాకిస్థాన్ టీమ్‌, కోచ్, సహాయ సిబ్బందికి వీసాలు ఇస్తే సరిపోతుందంటూ చెప్పుకొచ్చిన పీసీబీ.. తాజాగా ఆ దేశ అభిమానులకి, జర్నలిస్ట్‌లు, అధికారులకి కూడా వీసాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ మొదలుపెట్టింది. 
 
ఈ మేరకు వీసాలు ఇస్తామని భారత ప్రభుత్వం రాత పూర్వకంగా మార్చిలోపు హామీ ఇవ్వాలని తెగ పట్టుబడుతోంది. ఒకవేళ హామీ ఇవ్వని పక్షంలో టీ20 వరల్డ్‌కప్‌ ఆతిథ్యాన్ని యూఏఈకి మార్చేలా ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరికలు పంపిస్తోంది. 
 
ఇందులో భాగంగా ''వీసాల విషయంలో భారత్ నుంచి రాతపూర్వక హామీ ఇప్పించాలని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ (ఐసీసీ)ని మేము కోరాం. వీసాల విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తప్పించుకుంటోంది. ఒకవేళ మార్చిలోపు రాతపూర్వక హామీ రాకపోతే..? వరల్డ్‌కప్ వేదికని యూఏఈకి మార్చమని ఐసీసీపై ఒత్తిడి తీసుకొస్తాం'' అని పీసీబీ ఛైర్మన్ ఇషాన్ మణి హెచ్చరించాడు.
 
ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాక్ దేశాల మధ్య స్నేహసంబంధాలు దెబ్బతినడంతో.. భారత్, పాక్ జట్లు ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్‌‌లు ఆడడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే దాయాది జట్లు తలపడుతున్నాయి. 2016 టీ20 వరల్డ్‌కప్‌కి భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 
అప్పుడూ ఇలానే పాకిస్థాన్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అయితే.. భారత్‌కి వచ్చిన పాకిస్థాన్ టీమ్ ఆ టోర్నీలో ఆడి స్వదేశానికి వెళ్లింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్ ఆటగాళ్లతో పాటు అభిమానులు, అధికారులు, జర్నలిస్ట్‌లకి వీసాలు లభించడం కష్టంగా మారింది.