శనివారం, 9 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 6 మే 2019 (12:29 IST)

వరల్డ్‌ కప్‌కు ముందు టీమిండియాకు షాక్... ఆల్‌రౌండర్‌ దూరం?

ఐసీసీ మెగా ఈవెంట్ అయిన ప్రపంచ క్రికెట్ కప్ ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీకి ముందు భారత క్రికెట్ జట్టుకు తేరుకోలేని షాక్ తగిలింది. ఈ టోర్నీ కోసం అన్ని క్రికెట్ బోర్డులు తుది జాబితాను ప్రకటించాయి. అయితే, వరల్డ్ కప్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ కప్‌కు ఎన్నికైన భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ గాయపడ్డాడు. ఇది టీమిండియాను కలవరపరుస్తోంది. 
 
ఆదివారం పంజాబ్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో చెన్నై తరపున ఆడుతున్న జాదవ్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో జాదవ్ భుజానికి గాయమైంది. దాంతో జాదవ్‌ను మైదానం నుంచి స్ట్రేచర్‌పై బయటకు తీసుకెళ్లారు. మ్యాచ్ అనంతరం దీనిపై చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడారు. కేదార్‌కి ప్రస్తుతం ఎక్స్‌రే తీశామని, సోమవారం అతనికి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు. 
 
గాయం తీవ్రంకాకుండా ఉండేందుకు కొన్ని మ్యాచ్‌లకు అతడిని దూరంగా ఉంచనున్నట్టు చెప్పాడు. ముఖ్యంగా, ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీకి ముందు ఒక ఆటగాడు ఫిట్‌గా ఉండటం ఎంతో ముఖ్యమన్నారు. అయితే, జాదవ్‌కు అయిన గాయం అంత పెద్ద గాయంలా కనిపించడం లేదన్న ఆయన మంచి జరగాలనే జట్టు సభ్యులతోపాటు యాజమాన్యం కోరుకుంటుందన్నారు. 
 
ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న జాదవ్ టీమిండియాకు దూరమైతే కొంత కష్టాల్లోపడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువై జాదర్ ప్రపంచ టోర్నీకి దూరమైతే మాత్రం అతని స్థానంలో స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఉన్న అంబటి రాయుడు లేదా రిషబ్ పంత్‌లలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది.