ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

అహ్మదాబాద్‌ ఆతిథ్యానికి వరల్డ్ కప్ శోభ.. హోటల్ గదుల డిమాండ్.. ఒక్కరోజు అద్దె రూ.1.50 లక్షలు

Hotel
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం జరిగే తుదిపోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి, జీవిత కాల అనుభూతిని పొందడం కోసం క్రికెట్ అభిమానులు సంసిద్ధమై, అహ్మదాబాద్‌కు తరలివెళుతున్నారు. ధనవంతులు, పారిశ్రామికవేత్తలు కూడా భారీ సంఖ్యలో అక్కడకు చేరుకుంటున్నారు. దీంతో అహ్మదాబాద్‌లో హోటళ్లు, లాడ్జీల్లోని గదులకు భారీ డిమాండ్ ఏర్పడింది. 
 
ఈ తుది పోరుకు నెలకొన్న డిమాండ్‌ దృష్ట్యా అహ్మదాబాద్‌తో పాటు చుట్టుపక్కల నగరాల్లోని హోటల్‌ గదుల అద్దె ఆకాశాన్ని తాకుతోంది. ఫైవ్ స్టార్ హోటల్లో ఒక్క రాత్రి కోసం ఒక్కో గదికి అద్దె గరిష్ఠంగా రూ.2 లక్షలకు చేరింది. సాధారణ ధరలో లభ్యమయ్యే గదులకు కూడా ఇప్పుడు రూ.50 వేల నుంచి రూ.1.25 లక్షల వరకూ అద్దె వసూలు చేస్తున్నట్లు తెలిసింది. మామూలు రోజుల్లో ఒక్కో రాత్రికి రూ.3 వేల నుంచి రూ.4 వేలు వసూలు చేసే సాధారణ హోటళ్లు ఇప్పుడు ఈ అద్దెను రూ.20 వేలకు పెంచేశాయి. 
 
'అహ్మదాబాద్‌లోని ఐదు, మూడు నక్షత్రాల హోటళ్లలో కలిపి మొత్తం 5 వేల గదులే ఉన్నాయి. గుజరాత్‌ వ్యాప్తంగా 10 వేల గదులే ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ స్టేడియం సామర్థ్యం 1.20 లక్షలకు పైనే. 30 వేల నుంచి 40 వేల అభిమానులు బయట నుంచి వస్తారని అనుకుంటున్నాం' అని గుజరాత్‌ హోటల్‌, రెస్టారెంట్ల సంఘం అధ్యక్షుడు నరేంద్ర సోమాని తెలిపాడు. 
 
మరోవైపు అహ్మదాబాద్‌కు విమాన టికెట్‌ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో చెన్నై నుంచి అహ్మదాబాద్‌కు సుమారు రూ.5 వేలు టికెట్‌ ధరగా ఉంటుంది. కానీ ఇప్పుడది రూ.25 వేల నుంచి రూ.30 వేలకు వరకూ చేరింది. అలాగే, అభిమానుల కోసం ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలు నడుపుతామని రైల్వే శాఖ ప్రకటించింది. 
 
శనివారం రాత్రి 10.30 గంటలకు ముంబై నుంచి బయల్దేరే ఈ రైలు ఆదివారం ఉదయం 6.40 గంటలకు అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. మ్యాచ్‌ ముగిశాక అర్థరాత్రి అహ్మదాబాద్‌ నుంచి ముంబైకి మరో రైలు వెళ్లనుంది. మరోవైపు ఫైనల్‌కు టీవీ ప్రకటనల ధర కూడా కొండెక్కింది. 10 సెకన్ల ప్రకటనకు డిస్నీ-స్టార్‌ రూ.35 లక్షలు వసూలు చేయడం గమనార్హం.