గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (12:26 IST)

దేశ ఆతిథ్య రంగ ముఖ చిత్రాన్ని మార్చిన పీఆర్ఎస్ ఓబెరాయ్ ఇకలేరు...

prs oberoi
భారత దేశ హోటల్ వ్యాపార ముఖ చిత్రాన్ని మార్చిన పారిశ్రామికవేత్తల్లో ఒకరు, ఒబెరాయ్ హోటల్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన పీఎస్ఆర్ ఒబెరాయ్ ఇకలేరు. 94 యేళ్ళ వయసులో ఆయన తుదిశ్వాస విడిచారని ఒబెరాయ్ గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరుగనున్నాయి. తమ ప్రియతమ నాయకుడు పీఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూశారని తీవ్ర విచారంతో తెలియజేస్తున్నామని ఆ గ్రూపు అధికార ప్రతినిధి వెల్లడించారు.
 
ఆయన మరణం ఒబెరాయ్ గ్రూపుతో పాటు భారత్, విదేశీ ఆతిథ్య రంగానికి తీవ్రమైన నష్టమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంత్యక్రియలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరుగుతాయని తెలిపారు. ఢిల్లీలోని కపషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ చారిటబుల్ ట్రస్ట్ ఫామ్‌లో ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, పీఆర్ఎస్ ఒబెరాయ్ దూరదృష్టి గల నాయకుడు అని, అంకితభావం, మక్కువతో ఒబెరాయ్ గ్రూపు హోటళ్ళను ప్రపంచ వ్యాప్తంగా తీర్చిదిద్దారని ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయన విస్తరించిన హోటళ్ళు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆతిథ్య రంగాన్ని ప్రభావితం చేస్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, పీఆర్ఎస్ ఒబెరాయ్ దేశీయ హోటల్ వ్యాపార ముఖచిత్రానికి కొత్త రూపు తీసుకొచ్చి, ప్రత్యేక గుర్తింపును అందించారు.