సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 13 జూన్ 2017 (07:14 IST)

కీలక సమయాల్లో ఒంటరిగా ఉన్నాననే భావన రాకూడదు... అందుకే ధోనీ హెల్ప్ అవసరం: కోహ్లీ

ప్రతి మ్యాచ్‌లోనూ ధోనీ సలహాలు తీసుకోవడం అంటే అతడిపై ఆధారపడుతున్నానని అర్థం కాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్‌లో కూడా చాలాసార్లు ధోనీని సంప్రదించాకే కోహ్లీ ఫీల్డింగ్‌ను సెట్ చేశాడు, బౌలర్లకు బంతి ఇచ్చాడ

ప్రతి మ్యాచ్‌లోనూ ధోనీ సలహాలు తీసుకోవడం అంటే అతడిపై ఆధారపడుతున్నానని అర్థం కాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్‌లో కూడా చాలాసార్లు ధోనీని సంప్రదించాకే కోహ్లీ ఫీల్డింగ్‌ను సెట్ చేశాడు, బౌలర్లకు బంతి ఇచ్చాడు. అనుభవజ్ఞుడైన ధోనీ నుంచి సూచనలు తీసుకోవడం జట్టు ప్రయోజనాలకు అవసరమే కానీ ఇది నా వ్యక్తిగత వ్యవహారం కాదని కోహ్లి సమర్థించుకున్నాడు. 
 
‘గత మ్యాచ్‌లో కేదార్‌ జాదవ్‌కు బౌలింగ్‌ ఇచ్చే విషయంలో ధోనితో చర్చించాను. ఇక్కడా ఫీల్డింగ్‌ ఏర్పాట్ల విషయంలో మాట్లాడాను. కీలక సమయాల్లో నేను ఒంటరిగా ఉన్నాననే భావన రాకూడదు. తుది నిర్ణయం నాదే అయినా అనుభవజ్ఞుడైన ధోని నుంచి సూచనలు తీసుకున్నా’ అని విరాట్‌ విశ్లేషించాడు.
 
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టాస్‌ గెలువడం కలిసొచ్చింది. వికెట్‌ పెద్దగా మారలేదు. బ్యాటింగ్‌కు మైదానం బాగా సహకరిస్తుందని మేం భావించాం. మా బౌలర్లు నిజంగా చాలా బాగా ఆడారు. ఫీల్డర్లు శక్తివంచన లేకుండా కృషి చేశారు. మైదానంలో మేం పరిపూర్ణ ఆటతీరును కనబరిచాం’ అని కోహ్లి వివరించాడు. 
 
‘మేం అవకాశాలను చాలా బాగా ఒడిసిపట్టుకున్నాం. అందువల్లే అంత బలమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ లైనఫ్‌ను 190 పరుగులకు పరిమితం చేయగలిగాం. ఏబీ డివిలియర్స్‌ త్వరగా ఔట్‌ చేయడం మంచిదైంది. అతను మిడిల్‌ ఓవర్లలో ప్రత్యర్థిని దెబ్బతీయగలడు. అతన్ని ఔట్‌ చేయడం మ్యాచ్‌లో మాకు గొప్ప మలుపు. జట్టు సభ్యులు అంత తీవ్రత పెట్టి ఆడటం ఎంతో బాగుంది’ అని కోహ్లి వివరించాడు.
 
ప్రత్యర్థి బ్యాటింగ్ చేసేటప్పుడు బంతి విసిరిన బౌలర్ కంటే ఎక్కువగా ధోనీ అభిప్రాయం తెలుసుకుని తర్వాతే మూడో అంపైర్‌కు సంజ్ఞ చేయడం కోహ్లీకి దాదాపు అలవాటుగా మారింది. వికెట్ల వెనుక బంతి గమనంపై ధోనీ అంచనా అంత ఖచ్చితంగా ఉంటుంది కోహ్లీకి అపార విశ్వాసం.