శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 22 జులై 2017 (04:19 IST)

విశ్వ విజేతలం మేమే.. మమ్మల్ని ఓడించటం నీవల్ల కాదు ఇంగ్లండ్: మిథాలీ సవాల్

భారత జట్టు ప్రపంచ కప్‌ గెలిస్తే అది దేశంలో మహిళా క్రికెట్‌ దశ, దిశను మార్చగలదని మిథాలీ అభిప్రాయపడింది. ‘మేం లార్డ్స్‌లో విజయం సాధిస్తే అది గొప్ప ఘనత అవుతుంది. సరిగ్గా చెప్పాలంటే మహిళల క్రికెట్‌లో విప్లవంలాంటిది రావచ్చు. మహిళలు కనీసం ఒక ఐసీసీ టోర్నీ అ

భారత జట్టు ప్రపంచ కప్‌ గెలిస్తే అది దేశంలో మహిళా క్రికెట్‌ దశ, దిశను మార్చగలదని మిథాలీ అభిప్రాయపడింది. ‘మేం లార్డ్స్‌లో విజయం సాధిస్తే అది గొప్ప ఘనత అవుతుంది. సరిగ్గా చెప్పాలంటే మహిళల క్రికెట్‌లో విప్లవంలాంటిది రావచ్చు. మహిళలు కనీసం ఒక ఐసీసీ టోర్నీ అయినా గెలవాలని ఇప్పటి వరకు అంతా చెబుతూ వచ్చారు. దానికి ఇప్పుడు ఇదే సరైన వేదిక. భారత్‌ గెలిస్తే ఆ ఘనతను వర్ణించేందుకు నాకు మాటలు చాలవేమో’ అని ఈ హైదరాబాద్‌ అమ్మాయి పేర్కొంది. 
 
సెమీస్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ మెరుపు బ్యాటింగ్‌కు తోడు బౌలర్లుగా కూడా చాలా బాగా ఆడారని సహచరిణులపై మిథాలీ ప్రశంసలు కురిపించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ సమయంలో కండరాల గాయంతో బాధపడిన హర్మన్‌ప్రీత్‌ కోలుకుంటుందని మిథాలీ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ప్రపంచ కప్‌ ఫైనల్లో బరిలోకి దిగాలని హర్మన్‌ కూడా పట్టుదలగా ఉంటుందని నేను చెప్పగలను. ఇది జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం. మేమందరం కూడా ఈ మ్యాచ్‌ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం’ అని మిథాలీ తన మనసులో మాట చెప్పింది.
 
ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌కు తమ నుంచి గట్టి పోటీ తప్పదని భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. భారత్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉందని ఆమె, ఆతిథ్య జట్టును హెచ్చరించింది. టోర్నీ తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 35 పరుగులతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ‘ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఆడబోవడంపై మా జట్టు సభ్యులందరూ ఉద్వేగానికి లోనవుతున్నారు. ఈ టోర్నీ కష్టమైనదని మాకు తెలుసు. కానీ జట్టుకు అవసరమైన ప్రతీ సందర్భంలో అందరూ తమ సత్తా చాటారు. కాబట్టి ఫైనల్లో  మమ్మల్ని ఓడించడం ఇంగ్లండ్‌కు అంత సులువు కాదని గట్టిగా చెప్పగలను. ఆ రోజు ఎలా ఆడతామన్నది ముఖ్యం. మాతో ఓడిన తర్వాత ఆతిథ్య జట్టు ఆట కూడా మారింది కాబట్టి ఈ మ్యాచ్‌ కోసం మా వ్యూహాలు మార్చుకోవాలి. దీని కోసం మేమంతా సిద్ధంగా ఉన్నాం’ అని మిథాలీ చెప్పింది.
 
మహిళల వన్డే ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. ఇదే ఊపులో తొలిసారి విశ్వ విజేతగా నిలవాలని మన జట్టు పట్టుదలగా ఉంది. కాగా ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేసిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది. టోర్నీలో నిలకడగా రాణించిన మిథాలీ బృందాన్ని బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి అభినందించారు. హర్మన్‌ను ప్రత్యేకంగా ప్రశంసించిన ఆయన... ఫైనల్‌ మ్యాచ్‌ కోసం జట్టుకు బెస్టాఫ్‌ లక్‌ చెప్పారు.