గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Updated :హైదరాబాద్ , ఆదివారం, 22 జనవరి 2017 (08:46 IST)

ఈ డెత్ బౌలరే కోహ్లీ టీమిండియా తురుపుముక్క

అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో, నరాలు తెగే ఉత్కంఠ భరిత క్షణాల్లో, విజయం త్రుటిలో చేతులు మారిపోయే ఉగ్విగ్న స్థితిలో చివరి ఓవర్ బౌలింగ్ చేయాలంటే ఆ బౌలర్‌కి ఎన్ని గట్స్ ఉండాలి. అతడికి బంతి నివ్వడానికి కె

అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో, నరాలు తెగే ఉత్కంఠ భరిత క్షణాల్లో, విజయం త్రుటిలో చేతులు మారిపోయే ఉగ్విగ్న స్థితిలో చివరి ఓవర్ బౌలింగ్ చేయాలంటే ఆ బౌలర్‌కి ఎన్ని గట్స్ ఉండాలి. అతడికి బంతి నివ్వడానికి కెప్టెన్‌కి ఎంత విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం పేరే టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. కటక్ వన్డేలో ఇంగ్లండ్ విజయాన్ని తన్నుకుపోతున్న క్షణాల్లో చివరి ఓవర్‌ వేసిన భువనేశ్వర్ కుమార్ తన కెప్టెన్ కాదు.. కోట్లాదిమంది భారత అభిమానుల ఆశల విశ్వాసాన్ని నిలబెట్టాడు.
 
నిజంగానే భువనేశ్వర్ కుమార్ టీమిండియా ఫేస్ బౌలర్, ఆపత్సమయాల్లో ఆదుకునే తురుపుముక్క. బంతిని స్వింగ్ చేయడంలో అతడి నైపుణ్యం,  కీలక క్షణాల్లో యార్కర్లను సంధించే తీరును టీమిండియా యాజమాన్యం అద్భుతంగా ఒడిసి పట్టుకుంది. దాని ఫలితమే పరాజయం తప్పదనుకుంటున్న క్షణాల్లో ఇంగ్లండుతో రెండో వన్డే భారత్ వశం కావటం.
 
కటక్‌లో జరిగిన రెండోవన్డేలో ఇంగ్లండ్‌ గెలవాలంటే చివరి ఓవర్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. మూడు వన్డే మ్యాచ్‌ల సీరీస్‌లో ఇంగ్లండ్ నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ అది. ఇంతలో విరాట్ కోహ్లీ తన తురుపుముక్క భువనేశ్వర్ కుమార్‌కి బంతి అందించాడు. అయితే అదేమీ ఆశ్చర్యం గొలిపించే చర్య కాదు. 
 
ఇంగ్లండ్ 382 పరుగులు చారిత్రక ఛేజింగును సమీపిస్తున్న దశంలో జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ చివరి రెండు డెత్ ఓవర్లను వేసి భారత్‌ని సేవ్ చేశారు. ఐపీఎల్‌లో వీరిద్దరి విధ్వంసక బౌలింగ్‌ చూసిన కోహ్లీ కటక్ వన్డేను టీమిండియాకు అనుకూలంగా ముగంచడానికి ఈ ఇద్దరినే ఎంచుకున్నాడు. బంతి మంచులో తడిసినప్పటికీ భువనేశ్వర్ నిరాశపర్చలేదు. చివరి ఓవర్లో భువీ విసిరిన పుల్లర్ బాల్స్, వైడ్ యార్కర్లే టీమిండియాకు 15 పరుగులు తేడాతో విజయాన్ని కట్టబెట్టాయి. 
 
మూడో వన్డే కోసం శనివారం కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన భువీ ఐపీఎల్‌లో చివరి టైట్ ఓవర్లలో బౌలింగ్ చేసిన అనుభవమే గత గురువారం తనకు ఎంతో సహకరించిందని చెప్పాడు. తడి బంతులతో యార్కర్లను సంధించడం మేము ప్రాక్టీసు చేస్తూ వస్తున్నాం. ఒత్తిడిని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మేం అమలు చేయాల్సిన ప్లాన్‌లలో ఇదీ ఒకటి. కానీ మ్యాచ్ ఏదో ఒకరకంగా ముగియక తప్పదు అని భువనేశ్వర్ కుమార్ చెప్పాడు.
 
చివరి ఓవర్లలో నా బౌలింగ్ తీరుకు ఐపీఎల్ ఎంతగానో సహకరించింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌లో చాలా సార్లు నేను డెత్ ఓవర్లలోనే బౌలింగ్ వేయాల్సి వచ్చింది. ఆ మైండ్ సెట్‌ని నేను అంతర్జాతీయ క్రికెట‌లోకి తీసుకొచ్చాను. దాన్నే కొంతమేరకు కటక్ వన్డేలో ప్రయత్నించాను అన్నాడు ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈ ఫేస్ బౌలర్.
 
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన రెండు వన్డేలలోనూ 700 పరుగులు చేసినప్పుడు ప్రతిసారీ బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారనడం స్పష్టమే. కానీ భువనేశ్వర్ ఈ సవాలును పెద్దగా లెక్కచేయలేదు.

మేం ఇలాంటి స్థితికి అలవాటు పడిపోయాం. ఈ రోజుల్లో 350 పరుగుల స్కోరు పెద్ద స్కోరేం కాదు. ఇక్కడే టీమ్ మీటింగులలో మేం ప్లాన్ చేసుకుంటాం. క్రికెట్‌లో ఇప్పుడిది సాధారణ స్కోర్. 250-300 పరుగుల శకం నుంచి 350 పరుగుల శకంలోనికి మేము వచ్చాం. ఇది ఏమాత్రం సురక్షితమైనది కాదని తెలుసు. డెత్ ఓవర్లలో వెట్ బాల్‌తో యార్కర్లను సంధించడం అంత సులభమై విషయం కాదు.  కానీ ప్రాక్టీసులో వీటిపైనే మేం దృష్టి పెట్టాల్సి ఉంది అని భువీ చెప్పాడు.

మరి కాస్సేపట్లో భారత్-ఇంగ్లండ్ జట్ల మద్య కలకత్తా ఈడెన్ గార్డెన్‌లో జరగనున్న మూడో వన్డేలో భువనేశ్వర్ మళ్లీ తన ప్రతాపం చూపిస్తాడా అనేది చూడటానికి ఎదురుచూడాల్సిందే మరి.