ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించిన కంగారూలు.. ఆసీస్ ఘనవిజయం

Last Updated: బుధవారం, 26 జూన్ 2019 (09:11 IST)
ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిస్తున్న ఇంగ్లండ్ జట్టు.. కంగారూలతో పోరాడలేక చేతులెత్తేసింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 286 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడిన 221 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 64 పరుగుల ఆధిక్యంతో గెలిచింది.
 
ఆస్ట్రేలియా బౌలింగ్ ముందు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. ఒక దశలో ఇంగ్లండ్ 53 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. ఈ దశలో బెన్ స్టోక్స్ (89) మాత్రం క్రీజులో నిలబడి పరిస్థితిని తీర్చిదిద్దే పని భుజాన వేసుకున్నాడు. అయినప్పటికీ వికెట్ల పతనం మాత్రం ఆగలేదు. చివరకు ఇంగ్లాండ్ 44 ఓవర్లకు 221 పరుగులు చేసి ఆలౌటైంది. 
 
ఆస్ట్రేలియా బౌలింగ్ లో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టగా, మిచెల్ స్టార్క్ మాత్రం 4 వికెట్లు పడగొట్టాడు. ఇక మార్కస్ స్టోయినిస్ సైతం ఒక వికెట్ పడగొట్టి ఇంగ్లాండ్ పతనానికి కారణమయ్యారు. అయితే ఈ విజయంతో ఆసీస్ సెమీ ఫైనల్ బెర్తు కన్ఫార్మ్ చేసుకుంది.
 
ఇదిలా ఉంటే తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 285 పరుగులు చేసింది. ఓపెనర్ ఫించ్(100) సెంచరీతో శుభారంభం చేశాడు. చేసినప్పటికీ ఆ తర్వాత వికెట్లు పడటంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. ఒక దశలో ఆస్ట్రేలియా 37 ఓవర్లకే 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసినప్పటకీ, చివరి పది ఓవర్లలో కేవలం 70 పరుగులు మాత్రమే చేసి వేగంగా పరుగులు సాధించడంలో విఫలమైంది.
 
చివరికి ఫించ్, వార్నర్‌లు రాణించడంతో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా, జొఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, మొయిన్ ఆలీ చెరోవికెట్ సాధించారు.దీనిపై మరింత చదవండి :