మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (21:27 IST)

పాపం.. ఆప్ఘన్ బౌలర్... అవాంఛిత రికార్డు సొంతం

ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, మంగళవారం మాంచెష్టర్ వేదికగా ఇంగ్లండ్ - ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు రికార్డు స్థాయిలో అతి భారీ స్కోరు నమోదు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు వీరవిహారం చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 396 పరుగులు చేశారు. 
 
ఈ క్రమంలో ఆప్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్ అవాంఛిత రికార్డును నెలకొల్పాడు. తన పది ఓవర్ల కోటా పూర్తి చేయకముందే 110 పరుగులు సమర్పించుకుని పరమచెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 
 
నిజానికి కొన్నాళ్ళ క్రితం ఈ లెగ్ స్పిన్నర్‌ రషీద్ ఖాన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్లకు సైతం కష్టసాధ్యంగా ఉండేది. కానీ, ఈ వరల్డ్ కప్‌లో మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ గల్లీ బౌలర్‌గా తేలిపోయాడు. 
 
స్పిన్‌కు ఏమాత్రం సహకరించిన ఇంగ్లండ్ పిచ్‌పై ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ రషీద్ ఖాన్‌ను ఓ ఆటాడుకున్నారు. ఎంతలా అంటే, తన 10 ఓవర్ల కోటా పూర్తిచేయకముందే అంటే 9 ఓవర్లలోనే 110 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. 
 
వరల్డ్ కప్ చరిత్రలో ఇది కూడా ఓ రికార్డు. అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గా ఈ ఆఫ్ఘన్ బౌలర్ రికార్డు పుటల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు ఆఫ్ఘన్‌కే చెందిన నైబ్ పేరిట ఉంది. నైబ్ 101 పరుగులిస్తే, రషీద్ దాన్ని 110 పరుగులతో తిరగరాశాడు. 
 
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు మొత్తం 11 సిక్సర్లు బాదారు. బెయిర్ స్టో మొదలుపెట్టిన ఆ విధ్వంసాన్ని ఇయాన్ మోర్గాన్ తారాస్థాయికి తీసుకెళ్లడంతో రషీద్ ఖాన్‌కు అవాంఛిత రికార్డు తప్పలేదు.