మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (19:07 IST)

క్రికెట్ పసికూన బౌలింగ్ ఊచకోత : సిక్సర్ల మోత.. మోర్గాన్ వరల్డ్ రికార్డు

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా మంగళవారం క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ బౌలింగ్‌ను ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు ఊచకోత కోశారు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఒక్కరే ఏకంగా 17 సిక్సర్లు బాదారంటే... అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా, తాము విసిరే బంతులు తిరిగి గాల్లో తేలిపోతూ స్టేడియం గ్యాలెరీల్లో పడుతుంటే ఆప్ఘన్ బౌలర్లు నిస్తేజంగా చూస్తూ ఉండిపోయారు.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. కళ్లు చెదిరే బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ ఆటగాళ్లు బంతిని కసిదీరా బాదడమే పనిగా ఆడారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (71 బంతుల్లో 148) ఆఫ్ఘన్ బౌలర్లపై ఉగ్రరూపం ప్రదర్శించాడు. కనిపించిన ప్రతి బంతినీ స్టాండ్స్‌లోకి పంపడమొక్కటే తన లక్ష్యం అన్నట్టుగా బ్యాట్ ఝుళిపించాడు. 
 
ఈ క్రమంలో అరుదైన సిక్సర్ల వరల్డ్ రికార్డు కూడా మోర్గాన్‌కు దాసోహమైంది. ఆఫ్ఘన్ బౌలర్లను బండ బాదుడు బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్ వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో 17 సిక్సర్లతో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఇక, ఓపెనర్ బెయిర్ స్టో (90), జో రూట్ (88) సైతం ధాటిగా ఆడారు. చివర్లో వచ్చిన మొయిన్ అలీ సైతం ఆఫ్ఘన్ కూనలను వదిలిపెట్టలేదు. కేవలం 9 బంతుల్లోనే 1 ఫోరు, 4 సిక్సులతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 
 
ముఖ్యంగా ఈ ఇన్నింగ్స్‌లో ఇయాన్ మోర్గాన్‌దే వీరబాదుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫలితంగా అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మోర్గాన్ ఈ రికార్డును తన పేరిట మార్చుకున్నాడు. 
 
గతంలో క్రిస్ గేల్, ఏబీ డివిల్లీర్స్, రోహిత్ శర్మల పేరిటవున్న 16 సిక్సర్ల రికార్డును మోర్గాన్ 17 సిక్సర్లు బాది తిరగరాశాడు. చివరకు రషీద్ ఖాన్ వంటి మిస్టరీ బౌలర్ సైతం మోర్గాన్ దూకుడు ముందు విలవిల్లాడిపోయాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోర్గాన్ అవుటయ్యే సమయానికి రషీద్ ఖాన్ 8 ఓవర్లలో 96 పరుగులు సమర్పించుకున్నాడు.